వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఆర్భాటంగా ఊదరగొట్టి, ప్రత్యర్థులపై తొడగొట్టి..సవాల్ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు వైఎస్ జగన్. కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా అందుకోనంత ఘోరంగా సీట్లు వచ్చాయి. అయినా జగన్ లో ఓడిపోయామన్న భావన ఉండటం లేదు. పైగా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తిరిగి తామే అధికారంలోకి వస్తామని..కళ్లు మూసుకుంటే చాలు ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయని..తనకి ఇంకా వయసు కూడా ఉందని స్టేట్ మెంట్లు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఇద్దరు లేక ముగ్గురు మంత్రులు, పరిమిత సంఖ్యలో అధికారులు తప్ప జగన్ ను కలిసేందుకు భయపడేవారు. ఎందుకంటే ఎవ్వరికైనా జగన్ అపాయింట్ మెంట్ దొరకడం అంటే కష్టమే.
తాడేపల్లిలో పార్టీ కార్యకలాపాల కోసం వైసీపీ క్యాంపు కార్యాలయం నిర్మించుకున్నారు. పైగా జగన్ కార్యాలయం ఉన్న ఆ ప్రాంతంలో రాకపోకలపైనా పోలీసులు నిషేధాజ్ణలు విధించేవారు.
మహరాజా ప్యాలెస్ లా..
అప్పట్లోనే ప్రజలనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా పాలకులు మాత్రం విషయాన్ని లైట్ గానే తీసుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం అంటే మహరాజా ప్యాలెస్ అని పార్టీ కార్యకర్తలు భావించేవారు. ఇప్పుడు అధికారం లేదు. కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేదు. అయినా వైఎస్ జగన్ అనుచరులు తమ తీరు మార్చుకోవడం లేదు. జగన్ కోసం ఎన్నో ప్రయాసలు పడి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్న సొంత పార్టీ కార్యకర్తలకు సైతం నో అపాయింట్ మెంట్ అంటున్నారు.
గతంలో తాడేపల్లి క్యాంపస్ చుట్టుపక్కల ఎవరూ లోనికి రాకుండా పెద్ద పెద్ద గోడలు, కంచెలు ఏర్పాటు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆదేశంతో అనుమతి లేకుండా ఆక్రమించిన అదనపు స్థలాన్ని ,కంచెలను రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని వాటిని కూల్చివేశారు. దానితో ఇప్పుడు రోడ్డు విశాలమయింది.
సెక్యూరిటీ దురుసు ప్రవర్తన
వాహనాలు యథేచ్ఛగా ఎలాంటి ఆటంకం లేకుండా ఆ రోడ్డు వెంట వెళుతున్నాయి. స్థానిక ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఎటువంటి కంచెలు, అడ్డుగోడలు లేకపోవడంతో జగన్ ను కలిసేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే జగన్ భద్రతా సిబ్బంది కార్యకర్తలను ఎవ్వరినీ లోనికి అనుమతించలేదు. పైగా దురుుగా మాట్లాడి ఎందుకొచ్చారు అని విసుక్కున్నారు కార్యకర్తలపై. కార్యాలయంలో ఉన్న ఓ వ్యక్తికి ఫోన్ చేసిన కార్యకర్త సెక్యూరిటీని అతనితో మాట్లాడవలసిందిగా కోరాడు. అయినా సెక్యూరిటీ అధికారి దురుసుగా అతని సెల్ ఫోన్ లాక్కుని బయటకు విసిరేయడంతో కార్యకర్తలు కొద్దిసేపు సెక్యూరిటీతో గొడవ పడ్డారు. బయట ఇంత జరుగుతున్నా..లోపల జగన్ భజన గణం తెలుసుకోలేక పోవడం గమనార్హం. ఒకవేళ తెలిసినా మనకెందుకులే అనుకున్నారో ఏమో..
మారాలి జగన్..
కార్యకర్తలు మాత్రం తీవ్ర అసహనంతో సొంత పార్టీ నేత జగన్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం కనిపించింది. ఇలాంటి అహంకారపు చర్యలతోనే గత ఎన్నికలలో చేదు ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. ఏనాడూ కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదు. పార్టీని ప్రజల వద్దకు చేర్చేది కార్యకర్తలే అన్న సంగతి మర్చిపోయి నేతలు అలా ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బాహాటంగానే జగన్ ను తిట్టిపోస్తున్నారు. ఇకనైనా కావాలి జగన్ కాదు..మారాలి జగన్ అంటున్నారు సొంత పార్టీ కార్యకర్తలు.