తీర రాష్ట్రం గోవా టూరిస్టులకు ఫేమస్. అన్ని రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి పర్యటనలు చేస్తున్నారు. దక్షిణాది నుంచి ఎక్కువ మంది గోవా వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటారు. అద్భుతమైన బీచ్‌లో గంతులేయడమే కాదు.. లోకల్ హోటల్స్, రిసార్ట్‌లలో స్టే చేసి కూడా క్వాలిటీ టైమ్ గడుపుతారు. ఇక లిక్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చౌకగా దొరికే లిక్కర్‌ను.. అరుదైన మద్యాన్ని సేకరించి సేవిస్తారు. గోవా టూర్‌లో కచ్చితంగా మద్యం సేవించడం ఉంటుంది. ముఖ్యంగా యువకులు గోవా టూర్ వేశారంటే లిక్కర్ తాగాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. పర్యావరణాన్ని చూస్తూ పరవశించిపోతారు. కేవలం మన దేశ పర్యాటకులు మాత్రమే కాదు.. విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా రష్యన్లు ఎక్కువగా గోవాలో కనిపిస్తారు. వీరే కాదు.. గోవాకు వచ్చే చాలా మంది విదేశీ పర్యాటకులు మద్యం ప్రియులే. ఈ టూరిస్ట్ స్టేట్‌లో ఆల్కహాల్ బ్యాన్ అనేది ఊహించలేం. అనూహ్యంగా ఈ డిమాండ్ వచ్చింది. అదీ అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే నుంచే రావడంతో చర్చనీయాంశమైంది. కానీ, ఆయన సహచర బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ఆయన డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నారు.
గోవా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ప్రేమేంద్ర షేత్ మంగళవారం మాట్లాడుతూ.. వికసిత్ భారత్, వికసిత్ గోవా సాధ్యం కావాలంటే గోవాలో మద్యపానంపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఇక్కడ మద్యం తయారు చేసి వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని సూచించారు. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు మరణిస్తున్నారని వివరించారు. కానీ, ప్రేమేంద్ర షేత్ వాదనలతో తోటి బీజేపీ ఎమ్మెల్యేలు ఏకీభవించడం లేదు.
రెస్టారెంట్ల వ్యాపారాన్ని ప్రజలు మూసేసుకోవాలని ఎమ్మెల్యే ప్రేమేంద్ర షేత్ చెబుతున్నాడా? అంటూ బీజేపీ మహిళా ఎమ్మెల్యే డెలిలా లోబో పేర్కొన్నారు. ఇక్కడికి పర్యాటకులు రావడానికి లిక్కర్ కూడా ఒక కారణం అని వివరించారు. లోబో, ఆమె భర్తకు ఉత్తర గోవాలో హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయి.
ఆప్ ఎమ్మెల్యే క్రజ్ సిల్వా మాట్లాడుతూ.. గోవాలో మద్యపాన నిషేధం అసాధ్యమని వివరించారు. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, కానీ, అందులో గోవా ప్రజలు లేరని తెలిపారు. ఆల్కహాల్ అమ్మకంపై ఆధారపడి చాలా రెస్టారెంట్లు, హోటల్స్ ఉన్నాయని, అవి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వివరించారు.
బీజేపీ ఎమ్మెల్యే సంకల్ప్ అమోంకర్ స్పందిస్తూ.. మద్యపాన సేవనం పై తనకు కూడా ఆందోళనలు ఉన్నాయని, అయితే, డీ అడిక్షన్ సెంటర్ల గురించి ఆలోచించాల్సి ఉన్నదని వివరించారు. మద్యపాన సేవనాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని, కానీ, పూర్తి నిషేధం అసాధ్యమని తెలిపారు. గోవా ఒక టూరిస్టు రాష్ట్రమని, పర్యాటక పరిశ్రమలో లిక్కర్ కూడా ఒక భాగమని వివరించారు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మక పరిశ్రమలో చాలా మంది స్థానికులు భాగమయ్యారని, ఒక వేళ ఆల్కహాల్ నిషేధిస్తే స్థానికుల ఉపాధికి దెబ్బ వస్తుందని పేర్కొన్నారు.