బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వనీరెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నట్టుగా అసెంబ్లీలో ఏం జరగలేదు. మహిళా ఎమ్మెల్యేలు సబిత, సునీత, మిగతా బీఆర్ఎస్ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. లేని పోని వాతావరణం కల్పించేందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారిని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా మహిళా ఎమ్మెల్యేలుగా పార్టీలకు అతీతంగా అది ఎవరైనా సరే వారిని ప్రశ్నించేవాళ్లమని చెప్పారు. కానీ, సభలో వారు ఆరోపిస్తున్న విధంగా ఏం జరగలేదన్నారు. సబితను అగౌరపరిచే విధంగా ఎవరూ మాట్లాడలేదన్నారు. చేవెళ్ల చెల్లెమ్మ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆమెకు గతంలో ప్రిపరెన్స్ ఇచ్చిందని గుర్తుచేస్తూ.. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడెలా ఆమెను అగౌరపరుస్తదని ప్రశ్నించారు. కేవలం సభను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతున్నారని యశస్వినీరెడ్డి ఆరోపించారు.
ఎమ్మెల్యే సునీతపై కూడా ఆమె ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ అని ఆమె అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరు తెరిస్తే వారిని మార్షల్స్ తో బయటకు పంపించేవారన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయడంలేదన్నారు. సభలో ప్రతి ఒక్క సభ్యుడు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నదన్నారు.
అనంతరం ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుచుకున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరున్నదన్నారు. వారిలా కాకుండా తమ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నదన్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేదా ఇంకెవరైనా కూడా ఏ మహిళా ఎమ్మెల్యేను అవమానించేలా మాట్లాడలేదన్నారు. ఒకవేళ అలా జరిగితే తాము ఖండించేవాళ్లమన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు ఇదేనా మా జూనియర్ ఎమ్మెల్యేలకు నేర్పించేది? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ తీరును మార్చుకోవాలన్నారు.