పశ్చిమ బెంగాల్ జోలికొస్తే తాట తీస్తాం.. మమత బెనర్జీ వార్నింగ్..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల కొన్ని రాజకీయ శక్తులు పశ్చిమ బెంగాల్ ను విడదీయడానికి ప్రయత్నిస్తున్నాయని..అటువంటి వ్యతిరేక శక్తులలో బీజేపీ ఒకటని అన్నారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో రాజకీయ విద్వేషాలు సృష్టించి విడదీయాలని చూస్తే తాట తీస్తామని అసెంబ్లీ సమావేశాలలో దీదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలతో తీస్తా నదికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడి ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్న నది అది. అలాగే రైతుల వ్యవసాయ సాగునీటిని కూడా అందిస్తోంది. అలాంటి తీస్తా నదీ జలాలను బంగ్లాదేశ్ కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని..అటువంటి కుట్రలను భగ్నం చేస్తామని అన్నారు.

 

బెంగాల్ లో తీస్తా నది అంతర్భాగం

 

తీస్తా నదీ జలాలు బంగ్లాదేశ్ కు తరలిస్తే బెంగాల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారని ఆమె అన్నారు. అయినా తమ ప్రమేయం లేకుండా ఏక పక్షంగా కేంద్రం ఎలా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. తమకు బంగ్లాదేశ్ పై ఎలాంటి కక్ష లేదని..కేవలం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మాత్రమే ఈ చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. తీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందం పై కేంద్రం మరోసారి పునరాలోచన చేయాలని అన్నారు. అలా కాదని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఉద్యమిస్తామని, కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల మద్దతు కూడగట్టుకుని తమ నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని దీదీ స్పష్టం చేశారు.

 

మీడియా కవరేజ్ పై నిషేధమా?

 

కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలకు పాల్పడుతోందని అన్నారు ఆమె. పార్లమెంట్ సమావేశాలను కవరేజ్ చేసేందుకు వెళ్లే మీడియాను దూరం పెట్టడం నిరంకుశత్వమే అన్నారామె. కేంద్ర విధానాలను నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ సంఘాలు, మీడియా ప్రతినిధులకు మమతా బెనర్జీ తన మద్దతు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తున్న మీడియా ప్రతినిధులను ఇండియా కూటమి సభ్యులు కలిసి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. పార్లమెంట్ లో ఈ విషయంపై బీజేపీని నిలదీస్తామని మీడియా ప్రతినిధులకు హామీని ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *