ఉత్తర ప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. ప్రతాప్ గఢ్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పంచాయితీ పెద్దలు అనాగరికంగా వ్యవహరించారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేత సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఆమెను అందరూ చూస్తుండగానే అవమానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర ప్రదేశ్‌లోని ఇబ్రహీంపూర్ గ్రామానికి ఓ మహిళ భర్త బతుకు దెరువు కోసం ముంబైకి వెళ్లాడు. సదరు మహిళ అదే గ్రామంలో ఉంటూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గ్రామంలోని పంచాయితీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసకున్న పంచాయితీ పెద్దలు ముంబైలో ఉన్న ఆమె భర్తకు విషయాన్ని తెలియజేశారు. అంతే కాకుండా వెంటనే పంచాయితీకి రావాలని తెలిపారు.
భర్త, ముగ్గులు పిల్లల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన పెద్దలు ఆమె వివాహేతర సంబంధం నిజమేనని రుజువు చేశారు. అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి మెడలో చెప్పుల దండ వేసి ముఖానికి నల్ల రంగు పూసారు. అనంతరం ఆమె జుట్టును కూడా కత్తిరించారు. గ్రామస్థుల ముందే ఆమెను ఘోరంగా అవమానించారు. ఈ తతంగాన్ని గ్రామస్థుల్లోని ఒకరు వీడియో తీసారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. పంచాయితీ పెద్దలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.