తెలంగాణ అసెంబ్లీలో సోమవారం మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌పై తీవ్ర దుమారం రేగింది. ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి, మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్కకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు, ఆర్టీసీ కార్మికులకు ఏం చేసిందో నాలెడ్జ్ లేకపోవచ్చని కౌషిక్ రెడ్డి అన్నారు. దీంతో నాలెడ్జ్ లేదు అన్న మాటపై కాంగ్రెస్ సీరియస్ అయింది.
నాలెడ్జ్ లేదు అన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలని, లేదా అన్న మాటను వెనక్కి తీసుకోవాలి అంటూ ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్పీకర్ కలగజేసుకోవడంతో పాడి కౌషిక్ రెడ్డి ఆ మాటను వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు బస్సుల సంఖ్యను పెంచాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తూనే మరో వైపు ఆటో వాళ్లను ఆదుకోవాలని మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు బాగా నడుస్తున్నాయని అన్నారు.
బస్సులు పెంచి ఆటో కార్మికుల పొట్ట కొట్టాలా అని సీతక్క ప్రశ్నించారు. దూర ప్రాంతాల్లో మాత్రమే బస్సులు నడుస్తున్నాయని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల అసలు బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని అన్నారు. ప్రజలకు సేవ చేసే నాలెడ్జ్ మాత్రమే తనకు ఉందని అన్నారు.