తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేసింది. గత ఎన్నికల్లో రైతులకు రూ.2లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతలో రూ.లక్షవరకు రుణమాఫీ చేశారు. ఇందులో భాగంగా రెండో విడత మాఫీ ఈనెల 30న మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరుకు లక్షన్నర, ఆగస్టు 15 వరకు రెండు లక్షల రుణ బకాయిలను బ్యాంకులకు చెల్లించేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
పంట రుణమాఫీలో భాగంగా రెండో విడతలో సుమారు 7లక్షలమంది రైతులకు దాదాపు రూ.7వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తుంది. ఈనెల 19న మొదటి విడత ప్రారంభించగా.. ఇందులో సుమారు 10. 83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ.6వేల కోట్లు జమ చేసింది. అయితే పలు కారణాలతో సుమారు 17వేల మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు.
ఇదిలా ఉండగా, రూ.1.5లక్షలలోపు రుణం ఉంటే రుణమాఫీ అవుతుందని ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. వీసీ యూనిట్ ఉన్న రైతు వేదికల్లో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానునట్లు సమాచారం. అయితే కేవలం పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.