త్వరలోనే కొత్త ల్యాండ్ పాసు పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. ఆ పాస్ పుస్తకాల్లో కొత్తగా క్యూ ఆర్ కోడ్ ను ముద్రించి పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం రూ. 20 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఏపీ రెవెన్యూ, రెజిస్ట్రేషన్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి అనగానితోపాటు పలువురు అధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా ఏ మేరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయో ఆ వివరాలు వెలికితీయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులు ఆయా జిల్లాల్లో పర్యటించి సమాచారం సేకరించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. 22-A నుంచి ఫ్రీహోల్డ్ అయిన భూమిని రిజిస్ట్రేషన్ల వద్ద మరోసారి పరిశీలించి నిజమైన లబ్ధిదారులను తేల్చాలని చంద్రబాబు సూచించారు.
అదేవిధంగా మదనపల్లె ఘటన కేసులో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. మదనపల్లె మాజీ ఆర్డీవో, ప్రస్తుత ఆర్డీవో, సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేసింది.
‘మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనలో కుట్ర కోణం ఉంది. దీని వెనుక ఎంతటి వారున్నా కూడా ఉపేక్షించబోం. సమయం వస్తే పెద్దిరెడ్డి అయినా లేదా జగనైనా చర్యలు తప్పవు. గతంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినటువంటి భూములపై సమీక్షిస్తామని, రూ. కోట్ల విలువ చేసే భూములను రూ. లక్షలకే కేటాయిస్తారా? అంటూ ప్రశ్నించారు. రెవెన్యూ ఆఫీసులో భద్రత లేని పరిస్థితి నెలకొన్నది. రెవెన్యూశాఖ కార్యదర్శి 3 రోజులపాటు మదనపల్లెలోనే ఉన్నారు. ఆ ఘటనపై అధ్యయనం చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. అక్కడ జరిగిన అన్యాయాలపై ప్రజలు భారీగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశాం’ అంటూ మంత్రి అనగాని పేర్కొన్నారు