వ్యూహకర్తగా ఫుల్ స్టాప్.. కొత్త పార్టీతో పొలిటికల్ ఎంట్రీ..!

ఎన్నికల వ్యూహకర్త అంటే చాలా మంది తొలుత ప్రశాంత్ కిశోర్ పేరే గుర్తుకు వస్తుంది. 2014 లోక్ సభ ఎన్నికలు మొదలు వ్యూహకర్తగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వచ్చారు. మొన్నటి వరకు ఆయన మన వైపు ఉంటే ఇక తిరిగే లేదన్నంత భరోసాను రాజకీయ పార్టీలకు ఇచ్చారు. ఆయన సేవలు అందించిన కొన్ని పార్టీలు ఓటమి చవిచూసినా.. పోటాపోటీగా ఉన్న ఎన్నికల్లో ఆయన వ్యూహాలు అమలు చేసుకున్న రాజకీయ పార్టీలు విజయాన్ని కైవసం చేసుకున్నాయి. అందుకే ప్రశాంత్ కిశోర్ అంటే పోల్ స్ట్రాటజిస్ట్‌గా క్రేజీ బ్రాండ్‌ తయారైంది. ఆ తర్వాత ఆయన మార్గంలో నడవడానికి ఇప్పటికీ అనేకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజా లోక్ సభ ఎన్నికలకు ముందే ఆయన అస్త్రసన్యాసం చేశారు. తాను ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదని స్పష్టం చేశారు. ఐప్యాక్ ఒక వ్యవస్థగా పరిణామం చెందిందని, తాను లేకున్నా ఆ సంస్థ సేవలు అందిస్తూనే ఉంటుందని వివరించారు. అప్పటి నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ఆయన సేవలు అందించడం లేదు. కానీ, ఆయన తన ఫుల్ ఫోకస్ బిహార్ పైకి షిఫ్ట్ చేశారు.

 

లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లాలని అనుకున్నారు. కొన్నిసార్లు కాంగ్రెస్ పెద్దలతోనూ ఆయన సమావేశం అయ్యారు. కానీ, ఆయన పెట్టిన షరతులకు కాంగ్రెస్ అంగీకరించలేదు. డీల్ కుదరకపోవడంతో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరే నిర్ణయాన్ని విరమించుకున్నారు. కానీ, రాజకీయాల్లో దిగాలని మాత్రం బలంగా అనుకున్నారు. బిహార్‌లో రెండేళ్ల క్రితం ఆయన జన్ సురాజ్ పేరిట పాదయాత్ర చేపట్టారు. చాలా చోట్ల తిరిగారు. రాజకీయాల గురించి, మహాత్మా గాంధీ ఆలోచనలు, తత్వం గురించి ప్రసంగాలు ఇచ్చారు. ఎట్టకేలకు ఆయన రాజకీయ పార్టీని స్థాపించడానికి రెడీ అయ్యారు.

 

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జన్ సురాజ్ క్యాంపెయిన్ గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన రాజకీయ పార్టీగా మారబోతున్నదని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. గతంలో చెప్పినట్టుగానే అక్టోబర్ 2వ తేదీన జన్ సురాజ్ రాజకీయ పార్టీగా అవతరించబోతున్నదని తెలిపారు. ఈ క్యాంపెయిన్‌లో మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ మనవరాలు సహా చాలా మంది పాల్గొన్నారు. వీరందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీంతో వ్యూహకర్తగా తన కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టిన ప్రశాంత్ కిశోర్.. ఇక నుంచి ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా మారనున్నట్టు స్పష్టమైపోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *