ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ఎఫెక్ట్..13 కేంద్రాలు క్లోజ్

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా తయారయింది ఢిల్లీ కోచింగ్ సెంటర్ల పరిస్థితి. మొన్నటి శనివారం ఢిల్లీలో చోటుచేసుకున్న వరద సంఘటనలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.రావూస్ కోచింగ్ సెంటర్ పేరుతో నడిపిస్తున్న ఈ కోచింగ్ సెంటర్ పై పలు కేసులు నమోదయ్యాయి. తీవ్ర రాజకీయ దుమారం చెలరేగి అది కాస్తా రాజకీయ రంగును పులుముకుంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఢిల్లీ మున్సిపల్ యంత్రాంగం అంతా బీజేపీ అధికారంలోనే ఉంది. ఇదంతా ఢిల్లీ నగరపాలక సంస్థ నిర్లక్ష్యమే అంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా చేసుకుని బీజేపీని దోషిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా ఆప్ నేతలు, కాంగ్రెస్ నేతలు బీజేపీపై గుర్రుగా ఉన్నాయి. సరైన సమయంలో బీజేపీ నేతలు దొరికారని..ఇక ఈ విషయాన్ని రాద్దాంతం చేసేదాకా వదలకూడదని భావిస్తున్నాయి.

 

ముందు జాగ్రత్త చర్యలు

 

దీనితో అధికారులకు బీజేపీ నేతలు హుకుం జారీ చేశారు. వేటు వేయడానికి కూడా వెనకాడబోమని బెదిరించారు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు రావూస్ కోచింగ్ సంఘటన దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. చుట్టు పక్కల కోచింగ్ సెంటర్లు నడిపిస్తున్న కార్యాలయాలపై దాడులు జరిపారు. వీరంతా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, సరైన ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని, మరికొన్ని అనుమతులు లేకుండానే కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారని వివిధ కేసుల కింద దాదాపు 13 కోచింగ్ సంస్థలను సీజ్ చేశారు. వాటికి అధికారులు సీల్ వేశారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్లన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్వహించే కోచింగ్ సెంటర్లపై కొరడా ఝుళిపిస్తున్నారు.

 

మేయర్ ఇంటి ముట్టడి

 

నగరంలో వరద పరిస్థితిని అంచనా వేయడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. నగర మేయర్ ఇంటినిముట్టడించారు. బాధితులకు న్యాయం జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులను సస్సెండ్ చేయాలని కోరుతూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *