బీజేపీ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది. ఊరికే ఎలాంటి ఊసుపోని నిర్ణయాలు తీసుకోరు. ఆ సంగతి మరోసారి ప్రూవ్ అయింది. తెలంగాణకు నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. దీని వెనక భారీ స్కెచ్చే వేశారు కమలనాథులు. జిష్ణుదేవ్ వర్మ కు బలమైన హిందూ నేపథ్యం ఉంది. రామజన్మ భూమి వ్యవహారంలో ఓ సాధారణ కార్యకర్తగా బీజేపీలో ఎంట్రీ ఇచ్చిన జిష్ణుదేవ్ అనతికాలంలోనే త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. బీజేపీ అధిష్టానానికి వీర విధేయుడు. తెలంగాణలో బీజేపీ బలోపేతం అవ్వాలని భావిస్తోంది. ఇక్కడ వ్యవహారాలన్నీ కేంద్రానికి చేరవేయడానికి , పరోక్షంగా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానికి జిష్ణుదేవ్ నియామకం జరిగిందని రాజకీయ పండితులు లెక్కలేస్తున్నారు. మరి కొందరు రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి ఈ కొత్త గవర్నర్ ని నియమించి వుండవచ్చని ఊహాగానాలు చేస్తున్నారు.
నాడు కేసీఆర్ వెర్సెస్ తమిళ సై
బీజేపీ గతంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొలువుతీరి ఉండగా తమిళనాడు నుంచి తమిళ సైని తెలంగాణకు గవర్నర్ గా నియమించారు. మొదట్లో బాగానే ఉన్నా రానురానూ కేసీార్ తమిళ సైతో విభేదాలు పెంచుకుంటూ వచ్చారు. చివర్లో ప్రొటోకాల్ మర్యాదలు కూడా పాటించకుండా గవర్నర్ ని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం పెడుతూ వచ్చారు. ఎంతో ఆర్భాటంగా కొత్త సచివాలయ భవనం ఆహ్వానం కూడా గవర్నర్ కి అందలేదు. తమిళ సైని బీజేపీ ఏజెంట్ గా భావిస్తూ సందర్భం దొరికినప్పుడల్లా గవర్నర్ మీదా విరుచుకుపడ్డారు. అయితే చివర్లో గవర్నర్ కూడా కేసీఆర్ ప్రతిపాదించిన కీలక బిల్లలపై సంతకాలు చేయకుండా పెండింగ్ లో పెడుతూ వచ్చారు. అప్పటి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా గవర్నర్ తమిళ సై తన రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం వివాదాస్పదమయింది.
రేవంత్ వెర్సెస్ జిష్ణు దేవ్
ప్రభుత్వం మారింది కాంగ్రెస్ తరపున సీఎంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మోదీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా చేసిన రేవంత్ ప్రసంగాలు మోదీ ఆగ్రహానికి కారణమయ్యాయి. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంలో నోరు జారిన బీజేపీ పెద్దలు తర్వాత తమ తప్పును సరిదిద్దుకుని రిజర్వేషన్లు రద్దు చేయబోమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ కూడా మోదీని పెద్దన్నతో సంబోధిస్తునే మరో పక్క మోదీ చర్యలను ఎండగడుతున్నారు. రేవంత్ ధోరణి చూడబోతే కేంద్రంతో ఘర్షణ వైఖరి కొనసాగించేలా కనిపిస్తున్నారు. ఇదంతా చూసి మోదీ సర్కార్ తనకు అనుకూలంగా ఉండే జిష్ణు దేవ్ ను తెలంగాణకు పంపింది.
గవర్నర్ కు కీలక టాస్కులు
ఇప్పుడు కొత్త గవర్నర్ కు రెండు కీలక టాస్కులు బీజేపీ ప్రభుత్వం అప్పగించిందని భావిస్తున్నారు రాజకీయ పండితులు. ఇటు పార్టీని బలోపేతం చేయడానికి అటు రేవంత్ సర్కార్ ని నియంత్రించేందుకు మంచి అవకాశంగా భావిస్తోంది బీజేపీ. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాష్ట్రం నుంచి తెలంగాణకు వస్తే యాథృచ్ఛికంగా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఇంద్ర సేనా రెడ్డిని త్రిపుర గవర్నర్ గా పంపించడం చర్చనీయాంశంగా మారింది. నాడు కేసీఆర్ వెర్సెస్ తమిళ సై..నేడు రేవంత్ వర్సెస్ జిష్ణు దేవ్ గా భావిస్తున్నారు రాజకీయ పండితులు. రాష్ట్ర సమస్యల సాధన కోసం గవర్నర్ తో సానుకూల వైఖరితోనే ముందుకు సాగితే బాగుంటుందని రేవంత్ సర్కార్ కు రాజకీయ పండితులు సూచిస్తున్నారు.