పంచాయతీ ఎన్నికల్లో వాళ్లను గెలిపించుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నాయకుల ఎన్నికలు అయిపోయాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నాయకులు పోటీ పడతారు. గెలుస్తారు. కార్యకర్తలు వారి గెలుపు కోసం అహర్నిషలు కష్టపడతారు. ఇక త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి కార్యకర్తల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీ పడుతారు. సాధారణంగా నాయకుల గెలుపు కోసం పని చేసే కార్యకర్తలను ఆ తర్వాత నాయకులు మరిచిపోతూ ఉంటారు. కానీ, మేం అలాకాదు, పంచాయతీ ఎన్నికల్లో మా కార్యకర్తలను తప్పకుండా గెలిపించుకుంటాం. వారిని గెలిపించే బాధ్యతను మేం తీసుకుంటాం. కార్యకర్తలారా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి. బీఆర్ఎస్‌లో అధికారం కోల్పోయిన బాధ ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వారికి అవకాశం ఇవ్వరు’ అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కల్వకుర్తిలో సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి గొప్పతనాన్ని వివరించి, కల్వకుర్తికి వరాలు ప్రకటించారు.

 

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా.. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఏ హోదా అనుభవిస్తున్నా నల్లమల్ల బిడ్డనే అని, కల్వకుర్తి ప్రజల సోదరుడినే అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి ఎన్నో పదవులు చేపట్టారని, వాటిని సమర్థవంతంగా నిర్వహించి పదవులకే వన్నె తెచ్చారని వివరించారు. ఆయన నమ్మిన సిద్ధాంతం కొరకు చివరి దాకా నిలబడ్డాడని తెలిపారు. పార్టీలు మారలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యమిచ్చారని వివరించారు.

 

2014లో తెలంగాణ సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందనే కాంగ్రెస్ పెద్దల ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తూ.. ఆ రోజు కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ, ఆ రాష్ట్రాన్ని పాలించే కాంగ్రెస్ నాయకుడి పేరును ప్రకటించలేదని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఫలానా కాంగ్రెస్ నాయకుడిని సీఎంగా చేస్తామని చెప్పి ఉంటే కాంగ్రెస్సే తప్పకుండా గెలిచి ఉండేదని వివరించినట్టు తెలిపారు. వాస్తవానికి అప్పుడు జైపాల్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ఉండాల్సిందని, అలా చేయనందుకు పార్టీ నష్టపోయిందని అభిప్రాయపడ్డారు. జైపాల్ రెడ్డి సూచన మేరకే అప్పటి స్పీకర్ మీరా కుమారి తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని చెప్పారు. కానీ, ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలేవని పేర్కొన్నారు. ఆనాడు కల్వకుర్తి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని ఆనాడు జైపాల్ రెడ్డి బాధపడ్డారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు తాను ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని వివరించారు.

 

కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, ఇప్పుడు కల్వకుర్తి ప్రజలకు హామీ ఇస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ.. కల్వకుర్తిలో 100 పడకల ఆస్పత్రి, ఆర్ అండ్ బీ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నామని వివరించారు. మాడుగుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచడానికి రూ. 10 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. తాను చదువుకున్న కాండ్ర పాఠశాలకు రూ. 5 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ముచ్చెర్ల ప్రాంతంలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామని చెప్పారు.

 

నియోజకవర్గంలో అన్ని గ్రామాల పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు నిర్మిస్తామని, కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మాఫీలు చేసి రైతుల రుణాన్ని తీర్చుకుంటున్నామని వివరించారు. ఈ నెలాఖరులోగా రూ. 1.50 లక్షలలోపు రుణాను మాఫీ చేస్తామని, వచ్చే నెలలో రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు.

 

ఆ తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా కొట్రా చౌరస్తాలో మాజీ కేంద్రమంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *