ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే పాలనలో దేశం సరైన దిశలో పయనిస్తోందన్నారు. వందేళ్లకు ఒకసారి వచ్చే కరోనా మహమ్మారిని ఓడించామని, ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.
యావత్ దేశమంతా యువశక్తి నిండిన దేశమని కొనియాడారు. భారత్ లో ఉన్న మానవ వనరులు ప్రపంచానికే ఆకర్షణగా నిలిచిందని కితాబిచ్చారు. దేశంలో ఉన్న యువతను నైపుణ్య శక్తి కలిగిన మానవ వనరులుగా మార్చాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడు యువతకు నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలలో ఉద్యోగాలకు అవసరమైన పరిజ్ఞానం చాలా అవసరమన్నారు.
కేంద్రానికి అన్నిరాష్ట్రాల సహకారం ఉంటే.. సమిష్టి కృషితో వికసిత్ భారత్ – 2047ను సాధించగలమని ప్రధాని నరేంద్రమోదీ నీతి అయోగ్ సమావేశంలో తెలిపారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు.. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలవని పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో దేశం అనేక మార్పుల్ని చూస్తుందన్నారు. సాంకేతికంగా, జియో- పొలిటికల్ మార్పులు జరుగుతాయని చెప్పారు. రానున్న కాలంలో జరగబోయే ఈ మార్పులను మనమంతా అవకాశాలుగా మార్చుకోవాలని, అందుకు విధివిధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. ఈ నిర్ణయాలే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు తొలి మెట్టు అవుతుందని తెలిపారు.