కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్‌లో కొత్త క్యాపుల్: హైదరాబాదీ నాట్కో ఫార్మా అనుమతి: మూడోదశ ట్రయల్స్

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతోన్న లక్షలాది మంది పేషెంట్ల కోసం మరో క్యాపుల్ అందుబాటులోకి రానుంది. అమెరికన్ ఫార్మాకంపెనీలతో కలిసి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ సంస్థ నాట్కో ఫార్మా ఈ క్యాప్సుల్స్‌ను అభివృద్ధి చేసింది. రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఈ క్యాప్సుల్స్‌ను కరోనా వైరస్ పేషెంట్లకు అందజేసే వైద్య చికిత్సలో వినియోగించడానికి సమాయాత్తమౌతోంది. దీనికోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) అనుమతి కోరింది. అనుమతి పత్రాలను దాఖలు చేసింది.

ఆ క్యాపుల్స్ పేరు- మోల్‌నుపిరవిర్. అమెరికాకు చెందిన టాప్ ఫార్మా కంపెనీ మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరపాటిక్స్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. అదే ఫార్ములాను నాట్కో ఫార్మా వినియోగిస్తోంది. యాంటీ ఇన్‌ఫ్లుయెన్జాను కలిగి ఉంటుందీ క్యాపుల్స్. ఇప్పటి దాకా రెండు దశల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో అంచనాలకు మించిన ఫలితాలను ఇచ్చింది. మూడోదశలో మనుషులపై ప్రయోగించడానికి సిద్ధపడుతోందా సంస్థ. దీనికి అవసరమైన అనుమతులను ఇవ్వాలంటూ సీడీఎస్‌సీఓకు విజ్ఞప్తి చేసింది. మొదటి రెండు దశలకు సంబంధించిన క్లినికల్ డేటాను అందజేసింది.

మోల్‌నుపిరవిర క్యాప్సుల్స్ ద్వారా ట్రీట్‌మెంట్ అందజేసిన పేషెంట్లకు అయిదు రోజుల వ్యవధిలో సత్ఫలితాలు కనిపిస్తాయని పేర్కొందా సంస్థ. అత్యవసర పరిస్థితుల మధ్య దీన్ని వినియోగించుకోవడానికి సీడీసీఎస్ఓ అనుమతి ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. నోటి ద్వారా అందజేసే ట్రీట్‌మెంట్ కావడం వల్ల సత్వర ఫలితాలు ఉంటాయని తాము ఆశిస్తున్నట్లు నాట్కో ఫార్మ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్.. ప్రస్తుతం వినియోగంలో ఉంది. కరోనా వ్యాక్సినేషన్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కే చెందిన రెడ్డీస్ ల్యాబొరేటరీ తయారు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *