అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనకు సంబందించిన కేసులో మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఇంటి వద్ద నిద్రిస్తున్న ఆయనను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. వెంకట చలపతికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడనే పేరుంది. ఆయనను విచారిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని పోలీసులు చెప్తున్నారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో భూ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 22a నుంచి 2.19 లక్షల ఎకరాలను నిషేధ జాబితా తొలగించారు. ఇందులో అసెన్డ్ భూములు 1.82 లక్షల ఎకరాలు, చుక్కల భూములు 26.465 ఎకరాలు, రిజిష్టర్ అయిన భూములు 4,433.54 ఎకరాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో 98.978 ఎకరాలు నిషేధ జాబితా నుంచి తొలగించారు.
ఈ భూ బాగోతాకు సంబంధించిన రెవెన్యూ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఆర్డీవో మురళీ, హరిప్రసాద్‌లతోపాటు డీఆర్ఓఈలపై చర్యలు తీసుకోనున్నారు. రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, పుంగనూరు, మదనపల్లి, తిరుపతి అధికారులపై చర్యలకు సిద్ధమయ్యారు.