నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. మాజీ సీఎం కేసీఆర్ వస్తారా..?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం మొదలుకానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. తొలుత దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలుపుతుంది. ఈ మేరకు సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం శాసన సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.

 

సభా వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా బడ్జెట్ సమవావేశాల పని దినాలు, అజెండాను కమిటీ ఖరారు చేస్తుంది. ఈ సమావేశాలలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగానే స్కిల్ వర్సిటీ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.

 

అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకటన, రైతు భరోసా విధివిధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలలో అక్రమంగా లబ్ధిపొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం, విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రానున్నట్లు సమాచారం. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకాని సంగతి తెలిసిందే. అయితే ఈ సారి హాజరుకాకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు అందే సూచనలు ఉన్నాయి. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టే 25వ తేదీన కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *