ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంతో అంతకు ముందటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఫుల్ స్టాప్ పెట్టింది. రెండో టర్మ్‌ చివరిలో కేసీఆర్ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని ప్రకటించింది. ఇళ్లు కట్టుకునేవారికి నగదు డబ్బులు అందిస్తామని ప్రకటించింది. అప్పుడు కొందరు ఇళ్లు కట్టడం ప్రారంభించారు కూడా. కానీ, ఆ డబ్బులు వారికి అందలేదు. వారంతా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. వారితోపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందక బడుగు, బలహీన వర్గాల్లో చాలా మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించే సాహసం చేయలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ఇందిరమ్మ ఇల్లపై ఆశలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద దశల వారీగా రూ. 5 లక్షలు లబ్దిదారులకు అందిస్తామని తెలిపారు. దీంతో ఇప్పుడు ప్రతి గ్రామంలో కొన్ని డజన్ల కుటుంబాలు ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు.

 

ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. ఆగస్టులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్దిదారులకు తప్పకుండా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మువ్వా విజయబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. రైతు నుంచి వచ్చిన నాయకుడు విజయబాబు అని, ఆయన తన పదవికి కచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకం తనకు ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు సాగు నీరు అందించడంలో నీటి పారుదల అభివృద్ధి సంస్థకు రాష్ట్ర సీఎంతోపాటు ఖమ్మం జిల్లా మంత్రులం అండగా ఉంటామని చెప్పారు.

 

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వర్ద పరిస్థితిని ఆయన ఆదివారం సాయంత్రం సమీక్షించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెస్క్యూ టీమ్‌లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *