కేరళ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా తీవ్రత ఆధారంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. కాసర్‌గడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను రెడ్ జోన్ కింద పరిగణిస్తూ… ఆయా చోట్ల లాక్‌డౌన్ నిబంధనలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. ఈ నాలుగు జిల్లాల్లో ఎటువంటి రంగాలకు కూడా నిబంధనల నుంచి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. హాట్‌స్పాట్లను సీల్ చేసి ఉంచుతామని.. కేవలం నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే రెండు మార్గాలు తెరచి ఉంచుతామని పేర్కొంది.
ఇక మిగతా జిల్లాల్లో సరి- బేసి విధానం(అత్యవసర సేవలకు మాత్రమే)లో ప్రైవేటు వాహనాలను రోడ్ల మీదకు అనుమతిస్తామని పినరయి విజయన్ ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా రెస్టారెంట్లను రాత్రి ఏడు గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతినివ్వనున్నట్లు తెలిపింది. స్వల్ప దూర ప్రయాణాల కోసం అంతర్‌జిల్లాలో బస్సులు నడుపనున్నట్లు పేర్కొంది. అయితే ప్రతీ ఒక్కరు కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.