మహిళా బిల్లు కోసం తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఢిల్లీలో ఆందోళన..

తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నాకు బయల్దేరింది. మహిళా బిల్లు కోసం తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఢిల్లీలో ఆందోళన చేపట్టనుంది. ఈ ధర్నా 29వ తేదీకి వాయిదా పడింది. తమ డిమాండ్ నెరవరే వరకు పోరాటం ఆపబోమని తెలగాణ మహిళా కాంగ్రెస్ వెల్లడించింది. అప్పటి వరకు విరమించేది లేదని, విశ్రమించేది లేదని స్పష్టం చేసింది. మహిళా బిల్లుపై పోరాడటానికి ముందు సొంత పార్టీలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపైనా గళం విప్పాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తెలిపారు.

నామినేటెడ్ పదవుల విషయంలో మహిళా కాంగ్రెస్‌కు అన్యాయం జరిగిందని సునీతా రావు వివరించారు. మొత్తం 37 కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో పది శాతం కూడా మహిళలకు దక్కలేదని చెప్పారు. మహిళలకు సమాన హక్కు ఉండాలన్నది రాహుల్ గాంధీ నినాదామని గుర్తు చేశారు. న్యాయ్ కా హక్.. మిల్ నే తక్ అంటూ పోరాటానికి ఆయన పిలుపు ఇచ్చారని తెలిపారు. కాబట్టి, ఈ పార్టీలో మహిళలపట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లుతామని పేర్కొన్నారు.

జాతీయ మహిళా కాంగ్రెస్ అధినేత్రి అల్కా లాంబ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశామని సునీతా రావు తెలిపారు. ఇంకా కొంత మంది అధిష్టానం పెద్దలను కూడా కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని చెప్పారు. మహిళా కాంగ్రెస్‌లో ఉన్న 30 వేల మందికి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, తాము అడగడం కూడా లేదని వివరించారు. మహిళా కాంగ్రెస్ తరఫున జాబితాను అధిష్టానం పెద్దలకు అందజేశామని తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ఉన్నట్టు పేర్కొన్నారు. మహిళలకు సముచిత వాటా దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వివరించారు. ముందుగా తమ పార్టీలో జరుగుతున్న పరిణామాల పై పార్టీ పెద్దలతో చర్చిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *