భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం..

వాయుగుండం ప్రభావం ఏపీపై తీవ్రప్రభావాన్ని చూపిస్తోంది. వర్షాలతో పలు జిల్లాలలో రాకపోకలు స్తంభించాయి. ఎక్కడ ఏ వాగు గట్టు తెగుతుందో, ఏ చెరువు పొంగుతుందో అని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలతో ఏపీ రాష్ట్ర యంత్రాంగం రెడీ అయింది. ఎటువంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఒడిశాలోని పూరీ వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత క్రమంగా బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 

సురక్షిత ప్రాంతాలకు తరలింపు

 

రాష్ట్రం మొత్తం మీద అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ..ప్రజలు సురక్షిత ప్రాంతాలలోనే ఉండాలని, విద్యుత్ ట్రాన్స్ ఫారమ్ లకు దూరంగా ఉండాలని, చెట్ల కింద ఉండకూడదని, శిథిల భవనాలలో తలదాచుకోవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాలలో మత్యకారులు చేపలు పట్టేందుకు వెళ్ల వద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే కాకినాడ, భీమిలి, విశాఖ సముద్ర తీర ప్రాంతాలలో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. అందుకే అత్యుత్సాహంతో ఎవరూ సముద్రం వద్దకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాలు అతలాకుతలంగా మారాయి.

 

రహదారులపై వరద నీరు

 

అనేక చెరువులు,కాల్వలు పొంగి పొర్లడంతో జాతీయ రహదారులపై నీరు వచ్చి చేరింది. ఇప్పటికే ఉభయ గోదావరి పరిధిలోని పలు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవ ప్రకటించింది. ఇక కృష్ణా, గోదావరి నదులు సైతం పరవళ్లు తొక్కుతున్నాయి. శనివారం ఉదయనికి భారీ స్థాయిలో నీటి మట్టం నమోదయింది. ఆదివారం సాయంత్రానికి గోదావరి నదికి 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశం ఉంది. నెమ్మదిగా వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన వాట ఉధృతికి చుట్టుపక్కల ప్రాంతాలలో కాల్వలకు గండ్లు పడ్డాయి. అక్కడ కట్లేరు వాగు పొంగడంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలన్నీ కాల్వలను తలపిస్తున్నాయి. వరిపంట నిండా నీటితో మునిగిపోయింది. విజయవాడ, విశాఖ పట్నం లో ప్రాంతాలలో కొండ చరియలు విరిగి పడ్డాయి.ఏపీ విపత్తుల నివారణ సంస్థ ఎక్కడికక్కడ నివారణ చర్యలు చేపట్టడంతో ప్రాణ నష్టం అంతగా జరగలేదు. దవళేశ్వరం వద్ద గోదావరి శనివారం ఉదయానికి 10.3 అడుగులకు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *