వైసీపీకి విజయసాయి రెడ్డి గుడ్ బై..?

అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో మొదలైన ఆధిపత్యపోరు ఇప్పుడు బజారుకెక్కుతోందా? ఏడు పదుల వయస్సులో దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డికి పార్టీలో ఏ ఒక్కరూ ఎందుకని సపోర్ట్‌గా మాట్లాడటం లేదు? పార్టీలో నెంబర్ టూగా వెలుగొందిన రాజ్యసభ ఎంపీ ఇప్పుడు పార్టీలో ఒంటరైపోయారా? జగన్ కూడా ఆయన విషయంలో ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారా? అసలు వైసీపీలో సాయిరెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టిందెవరు? ఆ క్రమంలో ఆయన యాక్షన్‌ప్లాన్‌పై జరుగుతున్న ప్రచారం ఏంటి?

 

వైసీపీ 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడూ పార్టీలో జగన్ తర్వాత నేనే అన్నట్లు వ్యవహరించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. పవర్‌లో ఉన్నప్పుడు వైసీపీలో వివిధ సందర్భాల్లో విజయసాయికి ప్రాధాన్యత తగ్గుతున్నట్లు కనిపించినా తిరిగి ఆయన పుంజుకున్నారు. అయిత ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ పరిస్థితే అధ్వాన్నంగా మారితే.. విజయసాయిది మరింత దారుణంగా తయారైనట్లు కనిపిస్తుంది. శాంతి ఎపిసోడ్‌తో మీడియాలో ఆయన పేరు ఫోకస్ అవుతున్నంతగా ఇంతకు ముందు కూడా ఎవరిదీ అవ్వలేదు.

 

అసలా పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలతో పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ విజయసాయిరెడ్డి అంతటి వాడే రోడ్డెక్కారు. స్ట్రైట్‌గా ఎవరి పేరూ ఆయన బయట పెట్టకపోయినా ఆయన టార్గెట్ చేసింది వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డే అంటున్నారు.

 

వైసీపీలో అత్యంత కీలకంగా.. నెంబరు టూగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీలోనూ, విపక్షాల నుంచీ కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తినా సొంత పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా బయటకు వచ్చి ఆ ఆరోపణలను ఖండించలేదు. ఒకరకంగా పార్టీ మౌనం విజయసాయిరెడ్డిపై ఆరోపణలను నిజమేనన్న భావన సామాన్య జనంలో కూడా కలిగేలా చేస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలోనే తనపై ఈ ఆరోపణలు రావడం వెనుక ఉంది సొంత పార్టీ నేతలే అని విజయసాయి రెడ్డి మీడియా ముందు వ్యాఖ్యానించారు. దాంతో వైసీపీ లో ఇంటర్నల్ వార్ ఏ స్థాయిలో ఉందో ఫోకస్ అయింది. ఇక్కడ మరో విషయం ఏటంటే తనపై వచ్చిన ఆరోపణలపై విశాఖ వేదికగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసినా ఆయన పక్కన పార్టీ నేతలు ఎవరూ కనిపించలేదు. ఆయన పార్టీలో కీలక నేత అయినా విశాఖకు చెందిన వైసీపీ నేతలెవరూ ఆయనకు స్వాగతం పలకలేదు.

 

దాంతో జగన్ కూడా విజయసాయిరెడ్డి విషయంలో ఏ మాత్రం సానుకూలంగా లేరన్న టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి. అక్కడ విజయం కోసం ఏ మాత్రం ప్రయత్నించలేదని నామినేషన్ దాఖలు చేసిన క్షణం నుంచే తన ఓటమిని అంగీకరించేసినట్లు వ్యవహరించారని పార్టీ శ్రేణుల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి అదే విషయాన్ని నెల్లూరు వైసీపీ నేతలు జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారంట.

 

పార్టీలో జరుగుతున్న గమనించే విజయసాయిరెడ్డి సొంత అజెండాతో ముందుకు వెళ్లే అలోచనలో ఉన్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి సొంత చానెల్ ప్రకటన చేశారు. విశాఖలో ఆ విషయం స్పష్టం చేశారు. గతంలో కూడా ఆయన సొంత చానల్ మాట ఎత్తారు కానీ, ఆ తరువాత ఆ విషయంపై ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే తాను ప్రారంభించబోయే సొంత చానల్ తాను ఏ పార్టీలో ఉన్నానన్న దాంతో సంబంధం లేకుండా న్యూట్రల్ గా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. న్యూట్రల్‌గా అని ఆయన నొక్కి చెప్పడంతో.. వైసీపీ సొంత మీడియాను టార్గెట్ చేయడమే అంటున్నారు.

 

ఆ క్రమంలో విజయసాయిరెడ్డికి వైసీపీలో కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తనకున్న పరిచయాలను ఆధారం చేసుకుని కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారన్న చర్చమొదలైంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి వంటి వారు ఆయన వెంట నడిచే పరిస్థితి లేదు. దాంతో పార్టీకున్న 11 మంది ఎంపీల్లో మెజార్టీ సభ్యులను కలుపుకుని రాజ్యసభ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసే దిశగా పావులు కదుపుతున్నారంటున్నారు. బీజేపీకి కూడా రాజ్యసభలో బలం అవసరం అవ్వడంతో విజయసాయిరెడ్డి నిజంగా ఆ రూట్లో వెళ్తే ఈజీగానే వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *