డ్రంకన్ డ్రైవ్‌తోపాటు డ్రైవ్ ఆన్ డ్రగ్ టెస్టు కూడా..

సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనేక సమస్యలు, అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశంలో రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని వివరించారు. కాబట్టి, రుణమాఫీ అమలుపైన కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ నిర్ణయం అమలులో నిర్లక్ష్యం కారణంగా ఒక్క రైతు కూడా నష్టపోకూడదని స్పష్టం చేశారు.

 

రాష్ట్రంలో నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే.. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పౌరులకు ఈ కోణంలో ఎలాంటి సమస్యలు కలుగకుండా చూసుకోవాలని తెలిపారు. అలాగే, మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు స్టేషన్ల పరిధిలో పీఎస్ కమిటీలను పునరుద్ధరించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితుల పట్ల స్నేహపూర్వకంగా ఉండాలని, క్రిమినల్స్‌తో కాదని స్పష్టం చేశారు.

 

రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను సీఎం ఆదేశించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసు, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో పని చేయాలని, డ్రగ్స్‌ను అరికట్టి తీరాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంకన్ డ్రైవ్‌తోపాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించాలని తెలిపారు. హైదరాబాద్ నగరంలో రాత్రిపూట ఫుడ్ కోర్ట్‌ల విషయంలో ఇబ్బంది రానివ్వొద్దని పేర్కొన్నారు.

 

ఎవరో చెబితే కలెక్టర్లు, ఎస్పీలకు పోస్టింగ్‌లు ఇవ్వలేదన్న సీఎం.. సమర్థత ఆధారంగానే తాము నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు.. జిల్లా ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. అలాగే.. కలెక్టర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *