ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యం..!

విద్య, వైద్యం ఖరీదైనవిగా మారుతున్న ఈ కాలంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించారు. ఆయన స్ఫూర్తితోనే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ సేవలను విస్తరింపజేయాలని అందుకు తగిన ప్రణాళికలతో సిద్ధమవుతున్నవారు. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సదస్సులో ఆరోగ్యశ్రీని రేషన్ కార్డు లింక్ తో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచిత సేవలందించేలా చేయాలని ఆదేశాలిచ్చారు.

 

రూ.10 లక్షల వరకూ చేయూత

 

చేయూత పథకం కింద ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచారు. కొత్తగా డిజిట్ ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కుటుంబ సభ్యులు ఎంత మంది ఉంటారో అందరికీ కలిపి ఒకటే యూనిక్ డిజిటల్ కార్డు రూపంతో అందజేయనున్నారు. రాష్ట్రంలో చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే కార్డుల మాదిరిగా రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు అందించే ప్రక్రియ ఆరంభించనున్నారు.

 

తెల్ల రేషన్ కార్డులతో లింక్ లేకుండా

 

ఇప్పటిదాకా తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికనే ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తూ వచ్చారు. ఇప్పుడు వాటితో లింక్ పెట్టకుండా మరింతమందికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే ఈ స్కీమ్ ను కేబినెట్ ఆమోదించింది. అయితే ఇందుకు అర్హులైన వారు ఎందరు? లబ్దిదారుల కింద ఎవరెవరు వస్తారు అని లెక్కలు వేయకుండా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికీ డిజిటల్ కార్డులు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 1.30 కోట్ల కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేయాలనే యోచన చేస్తున్నారు.

 

కొత్తగా 72 సేవలు

 

రాష్ట్రంలో 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు. ఈ ఆరోగ్యశ్రీ సేవల కింద మరో 72 సేవలను కొత్తగా చేర్చాలని అనుకుంటున్నారు. దాదాపు 13 వందలకు పైగా ఆసుపత్రలు ఆరోగ్యశ్రీ సేవలను ఉచితంగా అందిస్తూ వస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డు కింద లబ్దిదారులు దాదాపు 289 రకాల వైద్య సేవలు ఉచితంగా పొందుతున్నారు. ఇప్పుడు ఈ పరిధిని మరింత విస్తృత స్థాయిలో తీసుకెళదామనే ఆలోచనతో సీఎం రేవంత్ భావిస్తున్నారు.

 

వైఎస్ఆర్ చెరగని ముద్ర

 

నాడు వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ సేవలకు ప్రజలనుంచి అద్భుతమైన స్పందన లభించింది. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలాంటి సేవలందించలేదని ప్రతి ఒక్కరూ హర్షించారు. అదే సమయంలో 108, 104 అంబులెన్స్ సేవలు, పల్లెలలో మొబైల్ వైద్యం అందుబాటులోకి తెచ్చారు వైఎస్. స్వతహాగా డాక్టర్ అయిన వైఎస్ ..పాదయాత్రలో సామాన్యులకు అవసరమైనవి తెలుసుకున్నారు. అందుకే ఆయన సీఎం అవ్వగానే ఆరోగ్యశ్రీ సేవలను పేదలకు ఉచితంగా అందించారు. వైఎస్ సంక్షేమ పథకాలను చూసి మళ్లీ రెండో సారి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు ఆకాంక్షించారు. నాటి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారు. మరుగున పడిన నాటి సంక్షేమ పథకాలు తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రజారోగ్యంపై దృష్టిపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *