తన తత్వం వారసత్వం కాదంటున్న జనసేనాని..

ప్రస్తుతం దేశం మొత్తం మీద వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా తమ వారసులకే టిక్కెట్లు ఇప్పించుకోవాలని రాజకీయాలలో తమ రక్తమే ఉండాలని చాలా మంది తహతహలాడుతున్నారు. అయితే సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారసత్వాన్ని కాదనుకుని తనకి తానుగా హీరోగా ఎదిగారు. అదే వ్యక్తిత్వంతో రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇంత కాలం అధికారంలో లేకున్నా ఎంతో హుందాగా నడుచుకున్నారు. ఏనాడూ పదవుల కోసం వెంపర్లాడటం లేదు. తాను కోరుకుంటే అనాడే కేంద్రంలో మంత్రి పదవి దక్కేది. ఎందుకంటే మోదీకి అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. అయినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణమే పవన్ కు ఆభరణమయింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు.

 

వారసత్వం ప్రసక్తే లేదు

 

తన దగ్గర వారసత్వ రాజకీయాలకు స్థానం లేదని తేల్చి చెప్పారు. చాలా మంది రాజకీయ నాయకులు మాదిరిగా తాను తన వారసులను రాజకీయాలలోకి రావాలని కోరుకోవడం లేదన్నారు. తనకు కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని వారసత్వంగా తాను పదవులను సంపాదించుకోలేదని అన్నారు. అసలు జనసేన పార్టీ సిద్ధాంతాలే అందుకు విరుద్ధమన్నారు. చాలా మంది తన వారసులను రాజకీయాలలోకి తీసుకొస్తారా, సినిమాలలోకి తెస్తారా అని అడుగుతున్నారని..తాను వ్యక్తిగతంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. తనకు అలా తీసుకొచ్చే ఆలోచనే లేదని అన్నారు.

 

కష్టపడితేనే పదవులు

 

ఎవరైనా సరే రాజకీయాలలో ఎదగాలంటే వ్యక్తిగతంగా కష్టపడి పదవులు పొందాలని సూచించారు. ఒక వేళ యాద్ధృచ్చికంగా రాజకీయాలలోకి వచ్చినవాళ్లు తమని తాము నిరూపించుకోవాలని అన్నారు. బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దితే వాళ్లు రాజకీయ నేతలు కారన్నారు. స్వతహాగా వాళ్లు ఎదగాలని సూచించారు. ముందుగా కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. తాను రాజకీయాలలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చానని అన్నారు. వారసులను తీసుకురావాలనే ఆలోచన ఇంతవరకూ చేయలేదని..ఇకముందు కూడా చేయబోనని స్పష్టం చేశారు.

 

ఉన్నత ఆదర్శాల పార్టీ

 

ముందుగా జనసేన పార్టీకి కొన్ని మహోన్నత లక్ష్యాలు, ఆదర్శాలు ఉన్నాయని అలాగే కట్టుబాట్లు కూడా ఉన్నాయని అన్నారు. వాటిని అధిగమించి ఏనాడూ ముందుకు వెళ్లనని, భవిష్యత్తులోనూ అలాంటి ఆలోచనలు చేయనని అన్నారు. దయచేసి నా రాజకీయ వారసులు అంటూ దుష్ప్రచారం చేయకండి..ఒకవేళ అలాంటి వార్తలు వచ్చినా నమ్మకండి అన్నారు మంత్రి పవన్ కళ్యాణ్. తనకు ప్రజలు కీలక బాధ్యతలు అప్పగించారని..ఆ బాధ్యతను నెరవేర్చడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ కట్టుబాట్లు గాలికి వదిలేసే నాయకుడిని తాను కాదని స్పష్టంచేశారు. ఇకపై తనపై అలాంటి భావనే ఉండి ఉంటే మనసులనుంచి తీసేయాలని అభిమానులను కోరారు. జనసేన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా కష్టపడి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. దయచేసి వారసత్వం విషయంలో తనని ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *