కోడికత్తి కేసు.. శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ..

ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసులో నేడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని కొట్టివేస్తూ కీలక తీర్పును వెలువరించింది. ఇదే కేసులో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

 

జగన్ పై కోడి కత్తి దాడి కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావుకు గతంలో ఐదేళ్ల తరువాత హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. దీనిపై హైకోర్టులో ఎన్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా తీర్పు మాత్రం నిందితుడికి అనుకూలంగానే వచ్చింది. ఈ క్రమంలో ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నేడు ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమంటూ నిరాకరిస్తూ కీలక తీర్పును వెల్లడించింది.

 

అయితే, కోడికత్తి దాడి కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఈ మేరకు ఎన్ఐఏ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో శ్రీనివాసరావు బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన ఎన్ఐఏకు ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు ఇదే కేసులో ఎలాంటి కుట్రా లేదంటూ ఏపీ హైకోర్టులో ఎన్ఐఏ గతంలో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, దాడి చేసిన కారణంగా మాత్రమే నిందితుడి బెయిల్ ను ఎన్ఐఏ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ కేసులో సమగ్ర విచారణ కోరుతూ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టు విచారణలోనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *