సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అనర్హులకు నోటీసులివ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, త్వరలోనే అర్హులే లబ్ధి పొందేలా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామంటూ వెల్లడించింది. మార్గదర్శకాలు ఇచ్చేవరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. అనర్హులకు లబ్ధి, రికవరీపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉండే పేద కుటుంబాలకు అందాల్సిన ఆసరా పెన్షన్లు దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు సైతం ఆసరా పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో బయటపడిన వారికి ఈ పెన్షన్ రద్దు చేయడంతోపాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నది. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసేంతవరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దంటూ సీఎస్ సూచించారు.