ఎమర్జెన్సీ అప్రజాస్వామికం కానీ, రాజ్యాంగ విరుద్ధం కాదు..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ తేదీని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హత్య దినంగా ప్రకటించడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఖండించారు. ఎమర్జెన్సీ రాజ్యాంగ హత్య కాదని, ఎమర్జెన్సీ కాలంలోనూ రాజ్యాంగం సజీవంగానే ఉన్నదని వివరించారు. కాబట్టి, మర్డర్ లేదని, రాజ్యాంగ హత్య అని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం తప్పిదమే అవుతుందని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ ఒక అప్రజాస్వామికమైన చర్య అని, కానీ, అది రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేశారు.

 

అలాంటి రోజును రాజ్యాంగ హత్య దినంగా ప్రకటించడం వెర్రితనమే అవుతుందని శశిథరూర్ కామెంట్ చేశారు. ఎమర్జెన్సీ కాలంలో కూడా రాజ్యాంగ సదృఢంగా, సజీవంగా ఉన్నదని, ప్రతినిధుల మద్దతుతో ఉన్నదని స్పష్టత ఇచ్చారు. ఏ హత్యా జరగలేదని ట్విట్టర్ వేదికగా శశిథరూర్ పోస్టు పెట్టారు.

 

1975 జూన్ 25న జరిగినదంతా కూడా రాజ్యాంగానికి లోబడే జరిగిందని శశిథరూర్ వివరించారు. ఆ చర్యలు అప్రజాస్వామికమని, రాజ్యాంగేతర చర్యలు కావని స్పష్టం చేశారు. ప్రతిపక్ష రాజకీయ నాయకులను అరెస్టు చేయడం, పాత్రికేయ స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం, ఆ కాలంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు అప్రజాస్వామికమైనవేనని శశిథరూర్ పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సమాధానంగా చెప్పారు. ఎమర్జెన్సీని ఆమె ఖండించడంపై ఈ మేరకు స్పందించారు. ఎమర్జెన్సీని సమర్థిస్తూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తా క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

 

ఎమర్జెన్సీ కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న వారిని గౌరవిస్తూ సంవిధాన్ హత్య దివస్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాగా, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఖండించింది. ఇది కేవలం మోదీ హెడ్‌లైన్స్‌లో కనిపించడానికి చేసిన ప్రకటన అని విమర్శించింది. పదేళ్ల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్న ఈ మోదీకి ప్రజలు 2024 జూన్ 4న షాక్ ఇచ్చారని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా కూడా ఘోర పరాజయాన్ని ప్రజలు కట్టబెట్టారని, ఈ రోజు చరిత్రలో ఇక పై మోదీ ముక్తి దివస్‌గా గుర్తుండిపోతుందని ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *