రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు త్వరలోనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నది. శుక్రవారం సచివాలయంలో హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్) పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైడ్రా విధివిధానాలపై చర్చిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో కీలకమైన సేవలను అందించేందుకు హైడ్రా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని ప్రజలకు విస్తృత సేవలను అందించేలా కొత్త వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, పోలీస్ విభాగాలన్నిటినీ మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. వర్షాకాలంలో విపత్తులు సంభవించే అవకాశం ఉన్నందున ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ తొలగింపు బాధ్యత హైడ్రాకు ఇవ్వాలని అధికారులకు సూచించారు. జోన్ల విభజనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన నిబంధనలను రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలన్నారు. అందుకు అవసరమైన ప్రత్యేక నిధులను కూడా కేటాయించే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు.