ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లిక్కర్ కేసులో గత నెల బెయిల్ ఇట్టే వచ్చినట్టు వచ్చి చేజారిపోయింది. జూన్ 20న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తే.. మరుసటి రోజే హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ఆయన బెయిల్ పోరాటం కొనసాగుతూనే ఉన్నది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణను తాజాగా ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. వెంటనే విచారించాలని అరవింద్ కేజ్రీవాల్ తరఫున వచ్చిన వాదనలను కోర్టు నిరాకరించింది. తన వాదన వినిపించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి గడువు ఇచ్చింది. ఈ నెల 15వ తేదీన విచారిస్తామని స్పష్టం చేసింది.
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ ప్లీ దాఖలు చేసింది. ఈ ప్లీపై కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారు. అయితే.. కేజ్రీవాల్ సమాధానం తమకు మంగళవారం ఆలస్యంగా అందిందని, కాబట్టి, రిజాయిండర్ దాఖలు చేయడానికి తమకు తగు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మాత్రం ఈడీ కౌన్సిల్‌కు సమయం ఇవ్వరాదని, వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కానీ, కోర్టు మాత్రం ఈడీకి సమయం ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని, మద్యం అమ్మకందార్లకు ఎక్కువ మార్జిన్లు వచ్చేలా కొత్త విధానంలో మార్పులు చేశారని, ఇది సౌత్ గ్రూప్ సహా ఆప్‌లకు లబ్ది చేకూర్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని అభియోగాలు రావడంతో ఈడీ కూడా దర్యాప్తులోకి ఎంటర్ అయింది. ఇది వరకే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను నిందితుడిగా చేర్చింది. చార్జిషీటులో డబ్బులు చేతులు మారాయని, ఈ లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఖర్చు పెట్టిందని ఈడీ ఆరోపించింది. కానీ, ఈడీవన్నీ కట్టుకథలేనని, మనీలాండరింగ్ జరిగినట్టు ఆధారాల్లేవని, ఒక్క రూపాయి కూడా సీజ్ చేయలేదని ఆప్ నేతలు కొట్టిపారేస్తున్నారు. రాజకీయ కారణాలతో ఎన్నికల వేళ బెయిల్ దక్కించుకున్న కేజ్రీవాల్.. మరి రెగ్యులర్ బెయిల్ దక్కించుకుంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కితే కవితకు కూడా రావడానికి మార్గం సుగమం అవుతుందనే ఆశ బీఆర్ఎస్ వర్గాల్లోనూ కనిపిస్తున్నది.