‘ప్రతీకారం తీర్చుకుంటాం’.. కఠువా ఉగ్రదాడిపై కేంద్రం

జమ్మూకశ్మీర్‌లోని కఠువా ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని.. దాడి చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే అన్నారు. చనిపోయిన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.

 

ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. “కఠువాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు వీరులను కోల్పోయాం. ఆ అమరవీరుల కుటుంబాలకు నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి వారి పట్ల సానుభూతి ఉంది. చనిపోయిన వారి నిస్వార్థ సేవను, త్యాగాన్ని దేశం ఎప్పుడూ మరిచిపోదు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టం. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను ఓడించితీరుతాం.” అని రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాలో ఆయన రాశారు.

 

కఠువాలోని మారుమూల మాచెడి ప్రాంతంలో ఒక ట్రక్కు పది మంది జవాన్లు పాట్రోలింగ్ చేస్తుండగా ఉగ్రవాదులు వారిపై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించగా.. మరో అయిదు మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన తరువాత ఉగ్రవాదులు అడవిలో పారిపోయారు. ప్రస్తుతం ఆర్మీ సిబ్బంది ఆ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

 

పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత జైషే మహ్మద్ (జేఎం) షాడో సంస్థ కాశ్మీర్ టైగర్స్ ఈ దాడికి బాధ్యత వహించింది. రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు రెండుసార్లు దాడులు చేశారు. గత కొన్ని వారాలుగా జమ్ముకశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు పెరిగిపోవడంతో స్థానికులు బయటికి రావడానికి భయపడుతున్నారు.

 

మరోవైపు భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. సైనికుల మృతి పట్ల తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని అన్నారు. ఉగ్రవాదులను అంతం చేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *