తెలంగాణ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, సీఎస్సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌తో కలిసి పలు ఆరోగ్య శిబిరాలను నిర్వహించింది. అయితే, ఈ శిబిరాల నిర్వహణపై సీపీఐ పార్టీ ప్రతినిధులు పలు ఆరోపణలు చేశారు. దీనిపై సంక్షేమ బోర్డు సీఈవో, కార్యదర్శి వివరణ ఇచ్చారు. ఈ శిబిరాల నిర్వహణలో తమతో భాగస్వామిగా ఉన్న సీఎస్సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ఆరోగ్య సేవల పరంగా విస్తృతమైన నెట్‌వర్క్, సాంకేతిక సామర్థ్యం ఉన్నాయని సెక్రటరీ వివరించారు.
సీపీఐ ప్రతినిధులు ఆరోపించినట్లుగా ఈ వైద్య శిబిరాలకు హాజరైన వారి నుంచి ఎలాంటి రుసుమూ వసూలు చేయలేదని స్పష్టం చేశారు. శిబిరాల్లో కార్మికులకు తగిన పరీక్షలు చేసి వాటి ఫలితాలను రిపోర్టుల రూపంలో అందించామన్నారు. కొందరు ఆరోపిస్తున్నట్లు అవేమీ నకిలీ రిపోర్టులు కావని, శిబిరాల నిర్వహణ అంతా అధికారుల పర్యవేక్షణలోనే జరిగిందని కనుక అలా జరిగే అవకాశమే లేదని వివరించారు.
కార్మికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని, కొందరు ఆరోపించినట్లుగా ఈ పరీక్షల జాబితాలో ఈసీజీ పరీక్ష లేదని కార్యదర్శి వెల్లడించారు. శిబిరాల వివరాలను సంస్థ వెబ్‌సైట్‌లోనూ పొందుపరచామని వివరించారు. శిబిరాలకు రాలేని వారికి ఇంటింటి వైద్య పరీక్షలకూ తాము రెడీ అవుతున్నట్లు తెలిపారు. నిరంతర సమీక్షలతో కార్మికులకు అన్నివిధాలుగా అండగా నిలిచేందుకే తెలంగాణ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనిచేస్తోందని, ఈ వాస్తవాలను అందరూ గుర్తించాలని సంస్థ కార్యదర్శి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరించారు.