ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్ పుణ్యమే : కెటీఆర్

బీఆర్ఎస్ నుంచి రోజురోజుకూ వలసల సంఖ్య పెరిగిపోతోంది. అటు గులాబీ పార్టీ అగ్రనేతలలో కలవరపాటు పెల్లుబుకుతోంది. కాంగ్రెస్ ఆపరేషన్ బీఆర్ఎస్ పరేషాన్ అన్న రీతిగా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1985 సంవత్సరంలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో హుందాగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అదే చట్టానికి అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార పక్ష నేతలు తూట్లు పొడుస్తున్నారని రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 2014 సంవత్సరంలోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వస్తోందని ఇప్పుడు కూడా వలసలను ప్రోత్సహిస్తూ ఫిరాయింపు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ కి వెళ్లిన కేటీఆర్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ మీడియాతో తెలంగాణ కాంగ్రెస్ వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

 

వలసలను ప్రోత్సహించేది కాంగ్రెస్సే

 

ఇతర పార్టీలనుంచి వలసలను ప్రోత్సహించే సంస్కృతి కాంగ్రెస్ దే అన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన కాంగ్రెస్ పాలనపై విసుగుచెందిన ప్రజలు ప్రత్యేక రాష్ట్రాలకై ఉద్యమించారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వెనుక ఉద్యమ కారుల త్యాగాలు, బలిదానాలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశాయి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. కేసీఆర్ పాలనే నయం అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 3 శాతం తేడాతోనే ఓటమిపాలయ్యామని అన్నారు. నెరవేర్చలేని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి నేడు ఆరు నెలలు దాటినా హామీల ప్రస్తావన లేదని అన్నారు.

 

రెండు లక్షల ఉద్యోగాలు నీటిపాలు

 

అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటలు నీటి మూటలయ్యాయన్నారు. అలాగే పేదింటి మహిళకు ఇస్తామన్న రూ.2,500 హామీ కూడా అటకెక్కించారని అన్నారు. ఒకే సారి రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తామని చెప్పి రైతులను అడ్డగోలుగా మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. ఎంతో ఆర్భాటంగా ఎన్నికల ముందు 420 హామీలను ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పటికి ఏడు నెలలు గడుస్తున్నా ఒక్క హామీని సైతం నెరవేర్చలేదని అన్నారు. ఆరు గ్యారెంటీలను పక్కకు పెట్టి ఆరు గురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారని..వలసలపైనే ధ్యాస తప్ప పాలనపై దృష్టి పెట్టలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 

చేనేతకు ఏదీ చేయూత

 

ఇప్పటికైనా అనాలోచిత నిర్ణయాలకు కాంగ్రెస్ స్వస్తి పలకాలని ముందుగా ఉపాధి హామీపై దృష్టిపెట్టాలని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలపై కక్ష కట్టిందని అన్నారు. నాడు చేనేత కార్మికులను ఆదుకునేందుకు బతుకమ్మ చీరల పథకం ప్రవేశపెట్టామని. చేనేత కార్మికుల సంక్షేమాలకు కట్టుబడి వారికి ఉపాధి కల్పించామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికుల బతుకులు ఆగం అయ్యాయన్నారు. నాడు రూ.350 కోట్ల బడ్జెట్ తో దసరా,రంజాన్, క్రిస్మస్ పండుగలకు చేనేత చీరలు పంపిణీ చేపట్టి చేనేత కార్మికుల ఇళ్లలో దీపాలు వెలిగించామన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కాంగ్రెస్ నిలిపివేయడంతో ఇప్పటిదాకా 10 మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు గురయ్యారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *