ఏపీలో చంద్రబాబు కేబినెట్ రెండోసారి సమావేశం కానుంది. ఈనెల 16న ఉదయం 11 గంటలకు భేటీ జరగనుంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం చర్చించనుంది. ఈ క్రమంలో గురువారంలోగా శాఖల వారీగా చర్చించే అంశాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇంకా శాఖల వారీగా లెక్కలు తేలక పోవడంతో నాలుగు నెలలపాటు ఓటాన్ అకౌంట్ పెట్టాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఈలోగా మిగతా శాఖలపై శ్వేపత్రాలు రిలీజ్ చేయడం, ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌ను పరిశీలించనుంది. అప్పుడు కసరత్తు చేసి అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుండగా మంగళవారం(నేడు) సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై ఆ భేటీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చ జరిగింది. డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం కీలకమన్నారు. సబ్సీడీ రుణాలు, వివిధ పథకాల కింద లబ్దిదారులను సహకరించాలని కోరారు.డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలకపాత్ర అని చెప్పుకొచ్చారు.
ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయానికొస్తే.. ఆర్థిక పరిస్థితి రీత్యా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం కష్టమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పుడున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మరో నాలుగు నెలలపాటు కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేయనుంది. ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థికశాఖ ఎదురుచూస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే సెప్టెంబరులో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది