ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రాజీనామా..!

ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే తన రాజీనామా లేఖను మంగళవారం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి పంపించారు.

గత ప్రభుత్వ హయాంలో రామాచార్యుల నియామకం జరిగింది. రామాచార్యులు, వైసీపీకి అనుకూల అధికారి అనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా శాసన సభ నిర్వాహణలో కూడా రామాచార్యుల వైఖరిపై పలు విమర్శలు ఉన్నాయి.

 

స్పీకర్‌గా ఇటీవల అయ్యన్న పాత్రుడి ఎన్నిక సమయంలో అసెంబ్లీ ప్రసారాలపై పలు టీవీ ఛానెల్స్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ఫైల్‌ను సిద్ధం చేయడంలోనూ ఆయన వ్యవహార శైలి తీవ్ర చర్చలకు దారి తీసింది. స్పీకర్‌ హోదాలో అయ్యన్న పాత్రుడు తొలి సంతకం చేసే ఫైల్‌పై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని .. మూడు ఛానల్స్‌పై నిషేధం ఎత్తివేసే అంశాన్ని పక్కదారి పట్టిచేందుకు యత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

 

గత ప్రభుత్వం హయాంలో రామాచార్యుల నియామకం జరగగా.. ఆయన పదవీ కాలం పూర్తయినా కూడా ప్రభుత్వం కొనసాగించింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రిటైర్ అయిన అధికారందరిని రాజీనామా చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామాను శాసన మండలి చైర్మన్ మోసెన్ రాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడికి అందజేశారు. మరో వైపు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమ చంద్రా రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ గవర్నర్ కార్యాలయం నోటీఫికేషన్ విడుదల చేసింది.

 

2020 సెప్టెంబర్‌లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా రామాచార్యులు నియమితులయ్యారు. ఈ మేరకు అప్పటి చైర్మన్ వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. 2018 నుంచి రాజ్యసభ కార్యదర్శిగా రామాచార్యులు పనిచేశారు. ఆ తర్వాత సెక్రటరీ జనరల్‌గా ఉన్న దేశ్ దీపక్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో రామాచార్యులు బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభలో పనిచేస్తూ సెక్రటరీ జనరల్ స్థాయికి ఎదిగిన తొలి అధికారి రామాచార్యులు. 1958 మార్చి 20న రామాచార్యులు జన్మించారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగా రామాచార్యులు పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *