ఆ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు..!

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరిగేలా 6 ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

 

ఇప్పటికే నిధులు ఖర్చు చేసినవి, ఆగిపోయినవాటిని, అదేవిధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. గోదావరి బేసిన్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 

గోదావరి బేసిన్ లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు దాదాపు రూ. 241 కోట్లు ఖర్చు అవుతుందని, వీటి ద్వారా 48 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని అధికారులు అంచనా వేశారు.

 

తక్కువ నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని, మార్చి 2025 నాటికి వందశాతం పనులు పూర్తవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక తయారు చేయాలన్నారు. రైతులకు సాగునీరు అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లు పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయన్నారు. మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే గత ప్రభుత్వం వదిలేసిందంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు.

 

అయితే, నీలం వాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి ప్రాజెక్టు ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజీ 2తో వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *