ఏపీకి సీఎం రేవంత్‌రెడ్డి..!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఫామ్ హౌస్, ప్యాలస్‌లకు పరిమితమయ్యారు గత పాలకులు. ఇదే అదునుగా భావించిన ముఖ్య మంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 2029 లక్ష్యంగా వీరిద్దరు అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా సక్సెస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం విజయవాడ వెళ్లనున్నారు.

 

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం విజయవాడలో జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌లోని కీలక నేతల వద్దకు వెళ్లి మరీ ఇన్విటేషన్లను అందజేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఆమె ఆహ్వానం మేరకు విజయవాడ వెళ్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పనిలోపనిగా ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు.

 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏపీకి వెళ్లడం ఇది రెండోసారి. ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ విశాఖలో నిర్వహించిన సభకు ఆయన హాజరయ్యారు. ఇప్పుడు విజయవాడ వంతైంది. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం చేయడం కోసం అప్పుడప్పుడు తాను వస్తానంటానని గతంలో చెప్పుకొచ్చారు. సమయం, సందర్భం కూడా ఆయనకు కలిసొచ్చింది.

 

వైఎస్ షర్మిల విషయానికొద్దాం.. ఆమె ఏపీ పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అందుకున్న తర్వాత తొలి వైఎస్ జయంతి వేడుకలు కావడంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కావాలని అడుగులు వేస్తోంది అక్కడి పార్టీ. తిరిగి తమ ఓటు బ్యాంకును దక్కించుకునే ప్రయత్నంలో పడింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మిగతా నేతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. హస్తం ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాలి.

 

నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పత్తా లేకుండాపోయింది. ఒకప్పుడు 151 సీట్లు గెలిచిన ఫ్యాన్ పార్టీ.. కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొంత గ్యాప్ వచ్చింది. దాన్ని అందుకోవాల ని భావిస్తోంది ఏపీ కాంగ్రెస్. తొలుత వైఎస్ఆర్ వారసుడు జగన్ అనుకున్నా, ఆయన పాలన చూసిన తర్వాత రాజుల పాలన వచ్చిందని భావించారు. ఆయన్ని దూరంగా పెట్టారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు పక్కపార్టీల వైపు తొంగి చూస్తున్నారు. వారిని సొంతగూటికి రప్పించాలని ప్లాన్ చేస్తోంది ఏపీ కాంగ్రెస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *