నేడే తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారి భేటీ అవుతున్నారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు ఇద్దరు భేటీ కావడం ఇదే మొదటి సారి కావడం విశేషం. అయితే, ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను స్నేహపూరిత వాతావరణంలో పరిష్కరించుకోనున్నారు. దీంతోపాటు భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామపంచాయతీల విలీనం అంశంపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

 

ప్రధానంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతోపాటు పౌరసరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా చర్చింనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.24వేల కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కార్ చెబుతుండగా.. ఏపీ మాత్రం రూ.7వేల కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *