తెలంగాణలో రాజ్యసభ సీటు ఎవరికి దక్కనుంది..?

తెలంగాణలో రాజ్యసభ సీటు ఎవరికి దక్కనుంది? తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు ఆ సీటు ఇస్తారా? లేకా సీనియర్లకు ఇస్తారా? ఇదే చర్చ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మొదలైంది. రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికి ఇస్తారన్న దానిపై నేతలు చర్చించుకోవడం మొదలైంది.

 

తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడవాళ్లకు సీటు ఇవ్వడం ఖాయమన్నది కొందరి నేతల వాదన. కానీ ఈ సీటును పార్టీలోని కీలక నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్‌మను సింఘ్వీకి ఆ సీటు ఇవ్వడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి.

 

పార్టీ హైకమాండ్ ఆయనకు దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో అభిషేక్ మనుసింఘ్వీ అనుకోకుండా ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను మరో చోట నుంచి పెద్దల సభకు పంపాలని భావిస్తోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ నుంచి కేశవరావు కాంగ్రెస్‌లోకి వచ్చారు. కేకే రూపంలో సింఘ్వీకి అదృష్టం కలిసి వచ్చిందని అంటున్నారు.

 

ఇప్పటికే కేకే తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్‌కు అందజేశారు. ఒక పార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యతను ఆ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత కేశవరావుకు కేబినెట్ హోదాతో కూడిన ప్రత్యేక సలహాదారు పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సూచన ప్రాయంగా చెప్పినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *