ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం చేస్తుందా..?

హస్తినలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. నిజానికి ఇది సాధారణ పర్యటన కాదనే అనిపిస్తోంది. ఈ పర్యటనకు ఏపీ అభివృద్ధికి పర్‌ఫెక్ట్ లింక్ ఉంది.. అమరావతి కావొచ్చు.. పోలవరం కావొచ్చు.. ఇలా రాష్ట్రంలోని ప్రతిడెవలప్‌మెంట్‌ వర్క్‌కు ఇప్పుడు కేంద్రంతో లింక్ ఉంది. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి దానిని సాధారణ పర్యటన అని అస్సలు అనుకోలేం..ఇంతకీ ప్రస్తుతం బాబు ఢిల్లీ పర్యటన ఆంతర్యమేంటి? ఈ టూర్‌తో ఏపీకి జరిగే లబ్ధి ఏంటి?

 

ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు.. ప్రధాని నరేంద్రమోదీతో పాటు.. కేంద్రమంత్రులను వరుసగా కలుస్తున్న చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో భేటీ.. జపాన్ అంబాసిడర్‌తో కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఫిక్స్‌ అయ్యింది. ఇలా చాలా న్యూస్ మనం చూస్తున్నాం. ఈ విషయాలన్ని కొందరికి న్యూస్ మాత్రమే. కానీ ఏపీ ప్రస్తుతమున్న పరిస్థితి గురించి తెలుసుకొని ఆ కోణంలో చూస్తే తెలుస్తుంది ఈ పర్యటన ఎంత ముఖ్యమో.. ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఏంటి? ఆగిపోయిన రాజధాని నిర్మాణం.. ఘోస్ట్ టౌన్‌గా కనిపిస్తున్న అమరావతి.. ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టుగా కనిపిస్తున్న పోలవరం ప్రాజెక్ట్.. ఇక కూటమి ఇచ్చిన భారీ ఉచిత హామీల అమలు.

 

అంతంతమాత్రంగానే ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. భారీగా పేరుకుపోయిన అప్పులు.. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు ముందున్న సవాళ్లు.. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన పరిస్థితి.. చంద్రబాబుకు ఎంత విజన్ ఉన్నా.. అపార అనుభవం ఉన్నా.. కేంద్రం సహకారం లేకుండా వీటిని సాధించే పరిస్థితి లేదు. అందుకే ఈ విషయాలపై ఓ క్లారిటీ తీసుకునేందుకే ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది.

 

ఒక్కసారి చంద్రబాబు షెడ్యూల్ చూస్తే.. మొదట ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్.. ఆ తర్వాత రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. ఆ తర్వాత వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్.. ఆ తర్వాత హోంమంత్రి అమిత్‌ షా.. ఇలా వీరందరితో భేటీ అయ్యారు చంద్రబాబు.. ఆ తర్వాత నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జీఏపీ నడ్డా, అథవాలేను కలవబోతున్నారు.. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కాబట్టి.. ఈ లిస్ట్ మొత్తం చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఒక్కటే.. ఏపీ ఆర్థిక పరిస్థితి కావొచ్చు, రావాల్సిన నిధులు కావొచ్చు.. ప్రాజెక్టులు కావొచ్చు.. ఇలా ఏపీకి ప్రస్తుతం అవసరమైన ప్రతి రంగానికి సంబంధించిన శాఖల మంత్రులను చంద్రబాబు కలుస్తూ వచ్చారు. వారికి కేంద్రం నుంచి తమకు కావాల్సిందేంటన్నది ఓ రిప్రజేంటేషన్‌ ఇచ్చారని తెలుస్తోంది.

 

అమరావతి విషయాన్నే చూసుకుందాం.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన చాలా మంది పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారు. వారిని తిరిగి ఒప్పించి అమరావతికి తీసుకురావడం అనేది కత్తి మీద సాము లాంటి వ్యవహారం.. ఇక్కడే చంద్రబాబు కేంద్రం సహకారం కోరుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రం కూడా అమరావతిలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టాలనుకుంది. కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడీ ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది.

 

ఎందుకంటే కేంద్రం ఒక్కసారి ముందుకు వస్తే ఆ ప్రాంతానికి ఓ బూమ్ వస్తుంది. దానిని బేస్ చేసుకొని మరికొన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఇక కేంద్రం కూడా అమరావతి నిర్మాణానికి సహకరించాలని కోరనున్నారు చంద్రబాబు.. ఇక కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు. నిజానికి ఈ హామీల అమలుకు చాలా నిధులు కావాల్సిన అవసరం ఉంది. అయితే నిధులను ఎలాగైనా సర్ధుబాటు చేయవచ్చు. కానీ ఆఖరికి ప్రజలపై భారం పడే అవకాశం ఉంది. అందుకే అలా భారం పడకుండా కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులను సమకూర్చుకునే పనిలో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది.

అందుకే ఒక్కో శాఖ మంత్రిని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు.

 

అయితే ఇక్కడ ఒక సంతోషించాల్సిన విషయం ఉంది. అదేంటంటే ఎన్డీఏ సర్కార్‌లో చంద్రబాబుది కింగ్ మేకర్ పోజిషన్.. కాబట్టి.. రెడ్ కార్పెట్ వెల్‌కమ్‌ దొరుకుతుంది. ఇదే వెల్‌కమ్‌ను నిధుల విడుదల, ప్రాజెక్టుల కేటాయింపులో కూడా కేంద్రం చూపిస్తే.. ఏపీ అభివృద్ధి మరింత సులభతరం కావడం తథ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *