న్యూఢిల్లీ: దేశంలో మెడికల్ ఆక్సిజన్‌కు విపరీతమైన కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 23 మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను జర్మనీ నుంచి విమానాల ద్వారా భారత్‌కు తరలించాలని నిర్ణయించింది. మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ఒక్కోటి నిమిషానికి 40 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే గంటకు 2,400 లీటర్లు. విమానాల ద్వారా తీసుకొచ్చే ఆక్సిజన్ ప్లాంట్లను కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్ఎంఎస్) ఆసుపత్రుల్లో మోహరిస్తామని రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన అధికార ప్రతినిధి ఎ భరత్ భూషణ్ బాబు తెలిపారు.
”23 మొబైల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను జర్మనీ నుంచి ఎయిర్‌లిఫ్ట్ చేస్తున్నాం. వీటిని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఏఎఫ్ఎంఎస్ ఆసుపత్రుల వద్ద మోహరిస్తాం” అని భరత్ భూషణ్ బాబు తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్లను మరో వారంలో తీసుకురాబోతున్నట్టు చెప్పారు. మరో అధికారి మాట్లాడుతూ.. జర్మనీ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఎయిర్‌ఫోర్స్‌కు ఆదేశాలు అందినట్టు చెప్పారు. అవసరమైన పేపర్ వర్క్ పూర్తయిన వెంటనే విమానాలు జర్మనీ బయలుదేరుతాయని పేర్కొన్నారు. విదేశాల నుంచి మరిన్ని ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను సేకరిస్తామనని భూషణ్ బాబు తెలిపారు.
కరోనా నేపధ్యంలో పరిస్థితులు పారిశ్రామిక రంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేసుల పెరుగుదల కారణంగా… ద్రవ రూప ఆక్సిజన్ వినియోగం ఆసుపత్రుల్లో విపరీతంగా పెరుగుతోంది . కరోనా కేసులతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నెలకొంది. ఈ పరిస్థితిని నివారించేందుకు… పరిశ్రమల ఆక్సిజన్ వాడకంపై నిషేధం విధించిన కేంద్రం… దానిని ఆయా రాష్ట్రాలకు తరలిస్తోంది. కాగా ఈ పరిణామాలు… మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటోమొబైల్స్ రంగాలకు ఇబ్బందిగా మారింది. ఆక్సిజన్ వాడకంపై పరిశ్రమలకు నిషేధం విధించటం మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటోమొబైల్స్ రంగాలకు మరోమారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేలా చేస్తోంది. పారిశ్రామికావసరాలకు వినియోగిస్తోన్న ఆక్సిజన్‌ను… ప్రజల వైద్యావసరాల కోసం కేటాయిండడం… చిన్న పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. కరోనా కేసుల పెరుగుదల కారణంగా మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోన్న నేపధ్యంలో వివిధ రాష్ట్రాల్లో కంపెనీలపై దీని ప్రభావం పడుతోంది.
ఆక్సిజన్ వాడకం నిషేధంతో కంపెనీలపై ప్రభావం పడుతున్నట్లుగా పేర్కొన్న క్రిసిల్… ప్రత్యేకించి మహారాష్ట్ర, న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్ , రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నట్లుగా పేర్కొంది. పారిశ్రామిక వినియోగానికి ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరా నిషేధించడంతో మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటోమొబైల్, విడిభాగాలు, షిప్ బ్రేకింగ్, ఇంజనీరింగ్ తదితర రంగాల్లోని చిన్న, మధ్యస్థాయి కంపెనీలు ప్రభావితమవుతాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. వెల్డింగ్, కటింగ్ వంటి పనులకు గ్యాస్ అవసరం ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 6-8 వారాలపాటు పారిశ్రామికావసరాలకు ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక పరిశ్రమలకు సుదీర్ఘకాలంపాటు ఆక్సిజన్ నిషేదం కొనసాగినపక్షంలో తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన ఉంది.