మహిళలకు త్వరలోనే తీపి కబురు చెబుతామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ తెలిపారు. విశాఖ నుంచి ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ పథకం అమలు చేస్తున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అంశాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టనున్నామని వెల్లడించారు.
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఆర్టీసీని వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని విమర్శించారు. సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రక్షాళన చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి తీరుతామని అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని వెల్లడించారు. ఫ్రీ బస్సు పథకాన్ని ఏపీలో పక్కాగా అమలు చేస్తామని తెలిపారు.
ఏ పథకాన్ని అమలు చేసున్నమో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అని అన్నారు. జగన్ లాగా రిబ్బర్ కటింగ్ చేసి వెళ్లిపోయే పరిస్థితి లేదు అని చెప్పారు. జగన్ కార్మిక వ్యవస్థను పాడు చేశారని ఆరోపించారు. జగన్ పాదయాత్రలో ఏయే కులాల్లో ఎక్కువ ఓటర్లు ఉన్నారో చూసుకొని వారందరికీ ఉచిత హామీల ఇచ్చారని అన్నారు. అంతే కాకుండా ఏపీఎస్ ఆర్టీసీని పట్టించుకోలేదని మండిపడ్డారు. రాయలసీమలో మాజీ మంత్రి పెద్ది రెడ్డి కుటుంబ మాఫియా అందరికీ తెలుసని అన్నారు.
జగన్ తర్వాత అత్యధికంగా అక్రమంగా సంపాదించింది పెద్ది రెడ్డి అని చెప్పారు. 1985-1990 మధ్య పెద్ది రెడ్డిది సామాన్య కుటుంబం అని అన్నారు. వైసీపీ పాలనలో పెద్ది రెడ్డి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. వైసీపీ పెద్ది రెడ్డికి కోట్ల రూపాయలు సమకూర్చిందని తెలిపారు. రాష్ట్రంలోని ఖనిజాలను పెద్ది రెడ్డి తవ్వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాలు దోచేశారని తెలిపారు. పెద్ది రెడ్డి చేసిన అక్రమాలన్నీ త్వరలోనే బయటపెడతామని పేర్కొన్నారు.