ఏపీలో పెన్షన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు..!

ఏపీలో అధికారంలోకి వస్తే పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఎన్ని కల్లో చంద్రబాబు ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఎన్నికల్లో కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. అనంతరం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లపై తొలి సంతకం చేశారు. మంత్రి వర్గ సమావేశంలో కేబినెట్ పెన్షన్ల పెంపుకు ఆమోదం తెలిపింది. దీంతో జూలై 1న పెన్షన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు.

 

ఏపీలో జూలై 1న జరగనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం అనంతరం జరిగే ప్రజా వేదిక కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులు, ప్రజలతో సీఎం ముచ్చటించనున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు భాగస్వాములు అవనున్నారు.

 

ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తానని ఇటీవల మాట ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లారు. దీంతో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు, టీడీపీ శ్రేణుల నుంచి సీఎం వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజల వినతులు చూస్తుంటే గత ఐదేళ్లలో ఎన్ని సమస్యలు ఎదుర్కున్నారో తెలుస్తోందన్నారు.

 

గత ప్రభుత్వం సరిగ్గా పని చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులు చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఇక ముందు నుంచి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోనూ వినతులు స్వీకరిస్తామన్నారు. గత ప్రభుత్వం కనీసం దెబ్బతిన్న రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని విమర్శించారు. వర్షాకాలంలో ప్రజలు రోడ్లపై తిరగలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *