పంచాయతీరాజ్ నిధుల వినియోగంపై డిప్యూటీ సీఎం కీలక చర్చలు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతీ శాఖపై మరింత అవగాహన తెచ్చుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

 

ఇందులో భాగంగా శాఖల స్థితి గతులు, నిధులు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై పవన్ సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరాపై సమీక్షలు నిర్వహించారు. తాజాగా, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

మంగళగిరిలోని తన నివాసంలో శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో నిధుల వినియోగంపై చర్చించారు. అలాగే ఆయా శాఖల్లో చేపట్టిన పనులపై ఆరా తీశారు.

 

గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధులు మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఇటీవల ఇంజనీరింగ్ విభాగం ప్రారంభించిన రోడ్లు, వంతెనల పనులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రుణాలు, వాటి వినయోగంపై అధికారులతో పవన్ చర్చించారు.

 

ప్రతీ శాఖలో ఉన్న విభాగాలకు సంబంధించి వేరు వేరుగా అధికారులను డిప్యూటీ సీఎం పిలిపించి పవర్ పాయింగ్ ప్రజంటేషన్ సైతం తీసుకుంటున్నారు. ఇప్పటికే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌కు సంబంధించి పవన్ పాయింట్ ప్రజంటేషన్ తీసుకున్నారు.

 

అంతకుముందు మున్సిపాలిటీకి సంబంధించి గ్రామీణాభివృద్ధి, మున్సిపాలిటీల్లో నీటి సరఫరా వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ తీసుకున్నారు.

 

ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. అయితే ఏఐఐబీ నుంచి వచ్చిన రుణాన్ని వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం విఫల్యాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేస్తే.. ఆ మొత్తాన్ని రీయింబర్స్ మెంట్ చేస్తామని ఏఐబీబీ చెప్పిందని తెలిసి పవన్ కల్యాణ్ ఆశ్చర్యపోయారు.

 

కాగా, పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మహిళలు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన జీతాలు చెల్లించేలా ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరారు. అనంతరం పవన్ కల్యాణ్ స్పందించారు. అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *