జులై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలు అమలు కానున్నాయి. బ్రిటీష్ వలస పాలన నాటి చట్టాల స్థానంలో కొత్తగా నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీరో ఎఫ్ఐఆర్, ఆన్ లైన్ లోనే పోలీసు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటి కీలక అంశాలను ఈ కొత్త చట్టాల్లో ఉండనున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండానే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసేందుకు వీలు కలగనున్నది. దీంతో తేలికగా, వేగంగా సమస్యను తెలియజేయడంతోపాటు పోలీసుల స్పందనను సులభతరం చేస్తుంది.
న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు కేసులను వేగంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విషయం తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియమ్ 2023 పేరుతో మొత్తం మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలు వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా అమలుకానున్నాయి.