రూ.1500 కోసం బ్యాంకుల వద్ద బారులు తీరున జనం

ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయాన్ని తీసుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఖాతాల్లో జమ అయిన రూ.1500 కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఎర్రటి ఎండలో బారులు తీరుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. డబ్బుల కోసం శుక్రవారం రామారెడ్డిలోని బ్యాంకు వద్ద క్యూలో నిలుచున్న ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది. లాక్‌డౌన్‌ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో మనిషికి 12 కిలోల చొప్పున ఉచితం బియ్యంతో పాటు రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే చాలా మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే, అంతకుముందు జన్‌ధన్‌ ఖాతాల్లో జమ అయిన డబ్బులు తీసుకోకుంటే పోతాయన్న వదంతులతో బ్యాంకులకు జనం పరుగులు తీసినట్టే.. ఇప్పుడు కూడా బ్యాంకులకు పరుగులు పెట్టారు. దీంతో బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. బ్యాంకు దగ్గరికి ఉదయమే వచ్చి ఎండల్లో క్యూ కడుతున్నారు. కొన్ని బ్యాంకుల దగ్గర టెంట్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వందలాది మంది తరలివస్తుండడంతో టెంట్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దానికితోడు భౌతికదూరం కూడా పాటించే పరిస్థితులు కూడా లేకుండాపోయాయి. ఈ క్రమంలో డబ్బుల కోసం శుక్రవారం బ్యాంకుకు వెళ్లిన రామారెడ్డి మండలం కన్నాపూర్‌ తండాకు చెందిన అంగోత్‌ కమల (45) గుండెపోటుతో కుప్పకూలి, క్షణాల్లో ప్రాణాలు కోల్పోయింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *