వ్యవసాయ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ లో నిర్వహించబడిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అప్పు తీసుకోవడం అభివృద్ధిలో భాగమని భట్టి తెలిపారు. బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణ పరిమితిని సాధించడం సంతోషకరమన్నారు. వ్యాపార రంగం అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర అని.. వ్యవసాయం, ఫార్మా, స్థిరాస్తి రంగాలకు త్వరితగతిన రుణాలు ఇవ్వాలని కోరుతున్నానన్నారు.
అలానే మాజీ మంత్రి హరీష్ రావు కు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్ళ పాలనను హరీష్ రావు మర్చిపోయారా.. అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుందని.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తమ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటి అని వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డే వ్యక్తులకు మాత్రం ఉక్కుపాదంతో అణిచివేసి కఠిన చర్యలు విధిస్తామని హెచ్చరించారు.
రుణ వివరాలు సరైన పద్ధతిలో ఇవ్వాలని బ్యాంకర్లను కోరుతున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించామని.. ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ పంటలు వస్తున్నాయన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని కోరారు మంత్రి తుమ్మల.