ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులను ప్రధాని మోదీ మంగళవారం వారణాసిలో విడుదల చేశారు. దీంతో 9.26 కోట్ల రైతులకు లబ్ది చేకూరనుంది. ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో రెండు వేల చొప్పున మొత్తం 20 వేల కోట్లు జమ కానున్నాయి. అనంతరం కృషి శాఖలుగా గుర్తింపు పొందిన 30,000 స్వయం సహాయక సంఘాల(Self Help Groups)కు ప్రధాని మోదీ సర్టిఫికెట్లు మంజూరు చేశారు.
మూడవ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ తొలిసారి వారణాసిలో పర్యటించారు. వారణాసిలోని పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేలన్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ 17వ విడత నిధులను విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్‌గా అవతరించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఇప్పటివరకు దేశంలోని కోట్లాది రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3.25 లక్షల కోట్లు జమ అయ్యాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో సరైన లబ్ధిదారులకు ప్రయోజనాలను అందించడానికి సాంకేతికతను మెరుగ్గా ఉపయోగించుకున్నందుకు సంతోషిస్తున్నానని మోదీ తెలిపారు.
వికసిత్ భారత్‌లో రైతులు, యువత, మహిళా శక్తి పేద ప్రజలు బలమైన స్తంభాలుగా ఉంటారని ప్రధాని మోదీ అన్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతులు, పేదలకు సంబంధించిన మొదటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు ప్రధాని మోదీ. ఈ ఎన్నికల్లో 31 కోట్ల మంది మహిళా ఓటర్లు పాల్గొన్నారని.. ఇది ప్రపంచంలోనే అత్యధిక మహిళా ఓటర్ల సంఖ్య అని తెలిపారు. ఈ సంఖ్య అమెరికా మొత్తం జనాభాకు దగ్గరగా ఉందన్నారు. భారత ప్రజాస్వామ్య బలం ప్రపంచానికి దిక్సూచి అని ప్రధాని మోదీ కొనియాడారు.
ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసినందుకు వారణాసిలోని ప్రతి ఓటరుకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని. కాశీ ప్రజలు ఎంపీని మాత్రమే కాకుండా మూడోసారి ప్రధానిని కూడా ఎన్నుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన ఆదేశం నిజంగా అపూర్వమైనదని కొనియాడారు. ఈ ఆదేశం ఒక కొత్త చరిత్రను సృష్టించిందని తెలిపారాయన.
ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో వరుసగా మూడవసారి తిరిగి రావడం చాలా అరుదుగా కనిపిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఈసారి భారత ప్రజలు దీన్ని నిజం చేశారన్నారు. 60 ఏళ్ల తర్వాత ఈ చరిత్ర పునరావృత్తం అయ్యిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్‌లతో సహా 2.5 కోట్ల మంది రైతులు పాల్గొన్నట్లు సమాచారం.
జూన్ 9న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ 10న బాధ్యతలు చేపట్టారు. అనంతరం తొలి సంతకాన్ని పీఎం కిసాన్ 17వ విడత చెల్లింపు దస్త్రంపైనే చేశారు.