ఏపీ శాంతి భద్రతలపై దృష్టి సారించామని హోం మంత్రి అనిత అన్నారు. గత ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. సింహాచల స్వామి వారిని ఆమె సోమవారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత తొలిసారి అప్పన్నను దర్శించుకోవడానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది పోలీసు అధికారులు ఆ పార్టీకి తొత్తులుగా పని చేశారని ఆరోపించారు. చాలా మంది పోలీసు అధికారులు తమలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్‌పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయాలని మంత్రి హితవు పలికారు. శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు.
పోలీసు ఉన్నతాధికారులతో హోం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ హబ్‌గా మారిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్ల నిర్వహణకు కూడా నిధలు లేవన్నారు. త్వరలోనే గంజాయి అణచివేతకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గంజాయి నివారణకు ప్రజా సహకారం కూడా అవసరమన్నారు. మూడు నెలల్లోనే వ్యవస్థను గాడిలో పెడతామని తెలిపారు. పోలీసు శాఖలో భారీ స్థాయిలో ప్రక్షాళన ఉంటుందన్నారు.