తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ అంశం కుదిరి పేస్తోంది. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో జడ్జీలు, అడ్వకేట్లు ఫోన్లు ట్యాప్ చేసినట్టు నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతోంది. దీంతో ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది.
పదేళ్ల కేసీఆర్ పాలనలో తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ రాజకీయ పార్టీల నేతలు గొంతెత్తారు. అప్పటి ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. అయితే ప్రభుత్వం మారింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడి కాగా, ఆ జాబితాలోకి హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, స్టూడెంట్ యూనియన్ నేతలున్నట్లు కీలక నిందితుడు సస్పెండైన అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడైంది.
వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడంతో అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలన్నది బీఆర్ఎస్ ప్రభుత్వ ప్లాన్‌గా ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ఎస్బీఐ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, సస్పెండ్ డీఎస్పీ ప్రణీత్‌రావు ఇష్టానుసారంగా వ్యవహరించారని బయటపెట్టారు. మునుగోడు, హుజారాబాద్ ఉప ఎన్నికల సమయంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఈ పనులు జరిగినట్టు తేలింది.
తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయనే భయంతో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, న్యాయవ్యవస్థకు చెందిన పలువురు వాట్సాప్, స్నాప్‌చాట్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను వినియోగించేవారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌ను ఇబ్బందిపెడుతున్న విద్యార్థి సంఘాల నేతల ఫోన్లు సైతం ట్యాప్ చేశారు. టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీపై విపక్ష నేతల మాటలపైనా నిఘా పెట్టినట్టు తేలింది. ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు నిధుల సమకూర్చ డం, ప్రైవేటు కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల మధ్య తగాదాలను పరిష్కరించడంలో రాధాకిషన్‌రావు ప్రమేయం ఉండేదని అందులో పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలోకి దిగారు. ఆయన గెలుపు కోసం ఆ ఎన్నిక కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్టు భుజంగరావు, తిరుపతన్నలు తమ వాంగ్మూలంలో ప్రస్తావించారు. బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ సోదరుడు కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ ఆ గ్రూప్‌లో సమాచారాన్ని షేర్ చేసినట్టు అంగీకరించారు. ఈ క్రమంలో పోలీసులు భారీ మొత్తంలో డబ్బు సీజ్ చేసినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.