ఇండియా కూటమి కోసం పాకిస్థాన్ లో ప్రార్థనలు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఎస్పీ కాంగ్రెస్ తో కూడిన విపక్షఇండియా కూటమి విజయం కోసం జీహాదీలు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని బన్స్‌గావ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఎస్పీ కాంగ్రెస్.. ఓటు జీహాద్ కు పిలుపునిస్తున్నాయని అన్నారు. పక్కా గృహాలు పొందుతున్న3 కోట్ల మంది పేదలు, రూ.5 లక్షల వరకూ ఉచిత చికిత్స అందుకునే వృద్ధులు, ముద్ర పథకంలో రుణాలు పొందే యువత ఇలా ఎందరో జూన్ 4న వెల్లడయ్యే తీర్పు కోసం ఎదురు చూస్తున్నారని మోదీ తెలిపారు.
మోదీ ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే యూపీలోని మీర్జాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మరోసారి తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్నారు. చిన్నతనంలో తాను కప్ ప్లేట్లు కడుగతూ..టీలు అందిస్తూ పెరిగానని చెప్పారు. అనంతరం సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేసి దానిని వృథా చేసుకోవద్దని సూచించారు. సుస్థిరమైన ప్రభుత్వానికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఇండియా కూటమి నేతల గురించి అందరికీ తెలుసని.. వారు మతతత్వ, కులతత్వ వాదులని ప్రధాని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా..కులం ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. సమాజ్ వాదీ ప్రభుత్వంలో మాఫియాను ఓటు బ్యాంకుగా చూస్తారని అన్నారు. కానీ తాము మాత్రం పేదలు, వెనుకబడిన వర్గాల కోసం అంకిత భావంతో పనిచేస్తామని వెల్లడించారు.